Begin typing your search above and press return to search.

విజయవాడ 'అద్దె'దిరిపోతోంది

By:  Tupaki Desk   |   8 March 2016 10:30 PM GMT
విజయవాడ అద్దెదిరిపోతోంది
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల నెలవారీ అద్దెను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌ లో ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ఏపీ ప్రభుత్వ భవనాల అద్దెను మాత్రం పెంచలేదు. మరో నాలుగు నెలల్లో రాష్ట్ర సచివాలయం - హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌ మెంట్స్ కార్యాలయాలను కొత్త రాజధాని ప్రాంతానికి తరలించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించడం వల్ల హైదరాబాద్‌ లోని భవనాల అద్దెలను పెంచలేదని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2011లో నిర్ణయించిన అద్దెలు అమలవుతున్నాయి. ఇంటి స్థలాలు - భవనాల నిర్మాణం వ్యయం విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఐదేళ్ల క్రితం నిర్ణయించిన అద్దెలు తమకు చాలడం లేదని.. వీటిని పెంచాలంటూ భవనాల యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అద్దెపెంచని పక్షంలో భవనాలను ఖాళీ చేయాలని కూడా అనేకమంది సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిలో భవనాల అద్దె హెచ్చింపుపై పరిశీలన చేసి, మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సు చేయాలంటూ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయం ప్రకారం విజయవాడ - గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అద్దెలను ఊహించని స్థాయిలో పెంచారు. 2011 లో నిర్ణయించిన అద్దెలను పరిశీలిస్తే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలో ఎక్కువ అద్దె ఉండేది. విజయవాడ - గుంటూరు పట్టణాల్లో అద్దెలు మూడో స్థానంలో ఉండేవి. తాజా నిర్ణయం వల్ల విజయవాడ - గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌ లలో అద్దెలు - విశాఖపట్టణాన్ని మించిపోయాయి.

2011 ధరల ప్రకారం విశాఖ కార్పొరేషన్ లో చదరపు అడుగుకు రూ.7 అద్దె ఉండగా ఇప్పుడు దాన్ని రూ.12 చేశారు. విజయవాడ గుంటూరులో రూ.7 ఉన్నది ఇప్పుడు రూ.15 నుంచి రూ.18 చేశారు. అంటే రెండు నుంచి రెండున్న రెట్లు పెంచినట్లు లెక్క. తిరుపతిలో మాత్రం రూ.7 ఉన్నది రూ.10 చేశారు. ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీల్లో రూ.5.5గా ఉన్న అద్దెను రూ.8కి.... ఇతర మున్సిపాలిటీల్లో రూ.3 నుంచి రూ.6 కి పెంచారు. గ్రామాల్లో కూడా చదరపు అడుగుకు రూ.2.5 గా ఉన్న అద్దెను రూ.5కి పెంచారు.