Begin typing your search above and press return to search.

పాడు వానలతో భగవంతుని రాజ్యం.. కన్నీటి సంద్రమైంది

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:23 AM GMT
పాడు వానలతో భగవంతుని రాజ్యం.. కన్నీటి సంద్రమైంది
X
భగవంతుని రాజ్యంగా పిలిచే కేరళను తాజాగా వానదేవుడు భారీగా దెబ్బ తీశారు. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా అదే పనిగా కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికింది. భారీ వర్షాలతో వరద నీటి బీభత్సం పలువురి ప్రాణాల్ని తీసింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతోపాటు.. ఆర్థిక నష్టాన్ని కలుగజేసింది. వేలాది మందికి గూడు లేకుండా చేసిన ఈ పాడు వానలు.. నిలువ నీడ లేకుండా చేశాయి. నాన్ స్టాప్ గా కురిసిన వానలకు తోడుగా కొండ చరియలు విరిగిపడటంతో పెద్దఎత్తున వాటి కింద చిక్కుకుపోయారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగిపడటం.. వరద తీవ్రతకుకొట్టుకుపోయిన విషాద ఉదంతంలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది.

మరణించిన వారిలో 13 మంది కొట్టాయం జిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం. ఆ తర్వాత ఇడుక్కి జిల్లా నిలుస్తుంది. ఈ జిల్లాకు చెందిన తొమ్మిది మంది మరణించగా.. అలప్పుజలో నలుగురు మరణించారు. వరదల్లోచిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో రెడ్ అలెర్టు ప్రకటించారు.

అసలే వర్షాలు ఎక్కువగా ఉండే కేరళలో.. తాజాగా కురిసిన భారీ వర్షం పెను నష్టానికి కారణమైంది. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కేరళకు కేంద్రం సాయం ఉంటుందన్న ప్రధాని మోడీ.. కేరళ ముఖ్యమంత్రి విజయన్ తో మాట్లాడారు. అపత్కాలంలో తాము అండగా ఉంటామని చెప్పిన మోడీ..అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం భరోసా ఇచ్చారు.

వర్షాల కారణంగా చోటు చేసుకున్న వరదలతో పెద్ద ఎత్తున ప్రజలు చిక్కుకుపోయారు. ఇలాంటి వారికి నిత్యవసర వస్తువుల్ని అందించేందుకు నౌకదళ హెలికాఫ్టర్ ను రంగంలోకి దించారు. పథనంతిట్టలోని పలు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న 80 మందిని ఎన్ డీఆర్ఎఫ్ టీంలు రక్షించాయి. ఇడుక్కి జిల్లాలో పలువురు విరిగి పడిన కొండ చరియల కింద చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కేరళలోని ఇడుక్కి.. కొట్టాయం జిల్లాల్లోని పలు గ్రామాలు దారుణంగా దెబ్బ తిన్నాయి.

వర్షాల కారణంగా చాలామంది ఆస్తుల్ని పోగొట్టుకొని విలపిస్తున్నారు.కొంతమందికి ఒంటి మీద దుస్తులు మాత్రమే మిగిలాయి. ఇడుక్కి జిల్లాలోని పీరుమెడులో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు 24 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం ఎప్పుడు కురిసింది లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కేరళ సీఎం ప్రజలకు ఒక సందేశాన్ని పంపారు. వర్షాల తీవ్రత తగ్గలేదని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాడు వర్షాలు కేరళను ఎప్పుడు వదులుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.