Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎన్నికల్లో ఏం పంచారో తెలిస్తే షాకే?

By:  Tupaki Desk   |   7 Feb 2020 9:30 AM GMT
ఢిల్లీ ఎన్నికల్లో ఏం పంచారో తెలిస్తే షాకే?
X
దేశ రాజధాని కొలువైన ఢిల్లీ రాష్ట్రానికి శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు గడిస్తే ఎన్నికలే. దీంతో పార్టీలన్నీ ఓటర్లకు ఆకట్టుకునేందుకు ప్రలోభాలు మొదలు పెట్టాయి.

ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో డబ్బు మద్యమే కాదు.. మత్తు పదార్థాలు, తుపాకులను కూడా ఓటర్ల కు పంచడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

గురువారం ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెరలేపాయి. ఇప్పటికే పార్టీలు పంచడానికి సిద్ధం చేసిన దాదాపు రూ.52.87 కోట్లను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. 2.63 కోట్ల విలువగల మద్యంను స్వాధీనం చేసుకుంది. బంగారం, వెండి, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఈసారి డ్రగ్స్ కూడా కలకలం రేపాయి. దాదాపు 5.87 కోట్ల విలువ చేసే డ్రగ్స్ నార్కొటిక్స్ ను ఎన్నికల అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది. 2015 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి దొరికిన మొత్తం ఏకంగా 25 రెట్లు కావడం గమనార్హం.

ఇక ఈసారి ఢిల్లీకి గన్ లు కూడా సరఫరా చేశారు. మీరట్ , మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఆయుధాలను తరలించిన 440మందిని ఈసీ అరెస్ట్ చేసింది. సీఏఏ ఆందోళనల్లో పేలిన తుపాకులు వీరు సరఫరా చేసినవనే చర్చ సాగుతోంది. విచారణ జరపగా మీరట్ లో తుపాకుల తయారీ ఫ్యాక్టరీని పోలీసులు కనుగొని నిందితులను అరెస్ట్ చేశారు.

ఇలా ఢిల్లీ ఎన్నికల్లో నగదు, మద్యమే కాదు.. డ్రగ్స్, తుపాకుల పంపిణీ కూడా జరగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.