Begin typing your search above and press return to search.

ఇదెట్ట న్యాయం : ఏపీలో వింత‌లు చూడరో !

By:  Tupaki Desk   |   4 May 2022 8:30 AM GMT
ఇదెట్ట న్యాయం : ఏపీలో వింత‌లు చూడరో !
X
ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న అన్న‌ది ఓ హ‌క్కు. నిర‌స‌న తెలపడం కూడా ఓ స్వేచ్ఛ‌లో భాగ‌మే .. స్వేచ్ఛ అంటే భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అని అర్థం. కానీ ఇక్క‌డ మాత్రం భిన్నం అయిన వాతావ‌ర‌ణమే క‌నిపిస్తోంది. గ‌తం క‌న్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయిన కార‌ణంగా ఆ పార్టీ ఏం మాట్లాడినా నిఘా వ్య‌వ‌స్థ‌లు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. అంతేకాదు క‌నీస స్థాయిలో నిర‌స‌న‌ల‌కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. ఆ విధంగా చంద్ర‌బాబు బ‌లం బాగానే పెంచుతున్నారు జ‌గ‌న్ .

గ‌తంలో విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఆ రోజు జ‌గ‌న్ ఎన్నో నిర‌స‌న దీక్ష‌ల‌కు దిగారు. ఓ విధంగా ఆ రోజు వైసీపీ అన్న‌ది దీక్ష‌ల పార్టీగా మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ నిర‌స‌న‌లకు దిగినా, మంత్రుల కాన్వాయ్ లు అడ్డుకున్నా ఒప్పుకోవ‌డం లేదు పోలీసులు. తీసుకుని పోయి స్టేష‌న్లో ఒక రోజంతా ఉంచి త‌రువాత న్యాయ‌మూర్తి ద‌గ్గ‌ర హాజ‌రు ప‌రిచి బెయిల్ ఇప్పిస్తున్నారు.

ఓ విధంగా ఇందెంత వ‌ర‌కూ న్యాయ‌మో వైసీపీ అధిప‌తులే ఆలోచించాలి. ఒక‌నాడు ప్ర‌జా స్వామ్య స్ఫూర్తిని చంద్ర‌బాబు మంట గ‌లిపార‌ని జ‌గ‌న్ మండి ప‌డ్డ మాట వాస్త‌వం కాదా? మ‌రి! ఇవాళ అదే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసులను మ‌రియు వ్య‌వ‌స్థ‌ల‌ను జ‌గ‌న్ త‌న‌కు అనుగుణంగా వాడుకోవడం లేదా అని ప్ర‌జా సంఘాలు విపరితంగా త‌మ గొంతుక‌లను వినిపిస్తున్నాయి. అయినా కూడా వ్య‌వ‌స్థ‌లో మార్పు అన్న‌ది రావ‌డం లేదు.

ఇక నిన్న‌టి వేళ రేప‌ల్లె అత్యాచార బాధితురాలిని క‌లిసేందుకు, పార్టీ త‌ర‌ఫున రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అందించేందుకు గుంటూరు జీజీహెచ్ కు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే (కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం) బాల వీరాంజ‌నేయ స్వామికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. పోలీసులు ఆయ‌న్ను ఆస్ప‌త్రి ప్రాంగణంలోనే అడ్డుకున్నారు. క‌లెక్ట‌ర్ చొర‌వ‌తో స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. ఇక్క‌డ నెల‌కొన్న ర‌గ‌డను ఆర్డీఓ ఫోన్ లో క‌లెక్ట‌ర్ కు విన్న‌వించ‌గా ఆఖ‌రికి జీజీహెచ్-లోకి ఎమ్మెల్యేను అనుమ‌తించారు. ఇదొక్క‌టే కాదు మొన్న‌టి వేళ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న ఇద్ద‌రు టీడీపీ మ‌హిళా నాయ‌కుల‌ను తీసుకువెళ్లి రోజంతా స్టేష‌న్లో ఉంచి. త‌రువాత‌నే కోర్టుకు హాజ‌రుప‌రిచారు.

ఇక ఇంకొన్ని చోట్ల టీడీపీ నాయ‌కులు రోడ్డెక్కకుండా గృహ నిర్బంధాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇవే కాదు ఇంకా చాలా వింతలున్నాయి. ఇవాళ్టికీ ఏద‌యినా ధ‌ర్నాకు విప‌క్షం పిలుపు ఇస్తే.. పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై సంబంధిత నాయ‌కుల‌ను స్టేష‌న్ల‌కు త‌ర‌లించి మ‌నో వేద‌న‌కు గురిచేస్తున్నారు. కొన్ని సార్లు పోలీసులు అతి చేస్తూ కొట్టి మ‌రీ ! విప‌క్ష నాయ‌కుల‌ను ఈడ్చుకెళ్లిన దాఖ‌లాలు ఉన్నాయి.

వీటిపై మంత్రులు కాస్త దృష్టి నిలిపి నిలువ‌రించాల్సింది పోయి క‌క్ష సాధింపు చ‌ర్య‌లను చేప‌ట్టాల‌ని పోలీసుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు సైతం విప‌క్షం నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప్ర‌జా స్వామ్య స్ఫూర్తిని కాపాడుతాం అని చెప్పే ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ విధంగా గొంతు నులిపెయ్యడం అస్స‌లు స‌బ‌బు కాదు అని, ఇదేవిధంగా ఆ రోజు చంద్ర‌బాబు న‌డుచుకున్నార‌ని, ఇప్పుడు జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబు బాట‌లోనే న‌డుస్తున్నార‌ని ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.