Begin typing your search above and press return to search.

బీజేపీకి ఇన్నివేల ఓట్లు ఎలా వచ్చాయి ?

By:  Tupaki Desk   |   3 Nov 2021 11:30 PM GMT
బీజేపీకి ఇన్నివేల ఓట్లు ఎలా వచ్చాయి ?
X
బద్వేలు నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్రంలో కూడా ఇదే విషయాన్ని జనాలు చర్చించుకుంటున్నారు. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో వైసీపీ గెలుపు ముందు నుండి ఊహించిందే. తమ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజారిటీ రావాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే లక్ష ఓట్లు కాకుండా అభ్యర్థి డాక్టర్ సుధకు 90 వేల మెజార్టీ వచ్చింది. 2019 ఎన్నికల్లో సుధ భర్త, దివంగత ఎంఎల్ఏ డాక్టర్ వెంకటసుబ్బయ్య పోటీ చేస్తే వచ్చిన మెజారిటీ సుమారు 45 వేలు ఓట్లు.

అంటే అప్పట్లో భర్తకు వచ్చిన మెజారిటికి ఇపుడు భార్యకు దాదాపు డబల్ ఓట్లు మెజారిటీ వచ్చింది. 2019లో వైసీపీకి వచ్చిన మెజారిటీకి ఇపుడు డబల్ వచ్చిందంటే అందులో ఆశ్చర్య పోవటానికి ఏమీలేదు. ఇంత భారీ మెజారిటీకి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టీడీపీ పోటీ చేయకపోవటం కారణాలుగా చెప్పుకోవచ్చు. వైసీపీకి వచ్చిన ఓట్ల సంగతి సరే మరి అప్పట్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. మరి ఈ రెండున్నరేళ్లలో కమలం పార్టీలో ఏమి మార్పు వచ్చిందని సుమారు 21 వేల ఓట్లొచ్చాయి ?

నియోజకవర్గంలో బీజేపీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే 281 పోలింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్లను కూడా పెట్టుకునే దిక్కులేదు. పోలింగ్ ఏజెంట్లనే పెట్టుకోలేని పార్టీకి ఇన్ని వేల ఓట్లు ఎలావచ్చాయి ? అన్నదే ఇపుడు ఆశ్చర్యంగా ఉంది. దీనికి సమాధానం ఏమిటంటే వైసీపీ ఎంఎల్ఏ జోగి రమేష్ వాదన ప్రకారం అధికారికంగా పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ, జనసేనలే బీజేపీకి ఓట్లు వేయించాయట. పోలింగ్ ఏజెంట్లుగా 270 కేంద్రాల్లో టీడీపీ నేతలే కూర్చున్నట్లు రమేష్ చెప్పారు.

పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటంతో పాటు టీడీపీ నేతలే కమలం పార్టీ అభ్యర్థికి ఓట్లు కూడా వేయించినట్లు జోగి ఆరోపించారు. పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ, జనసేనలు లోపాయికారీగా కమలం పార్టీకి ఎలా పనిచేస్తాయని జోగి నిలదీశారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ శ్రేణులు కూర్చున్నారనే ఆరోపణలపై ఇంతవరకు టీడీపీ ఖండించలేదు. పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ నేతల ఫొటోలు వైరల్ అవ్వటంతో సీనియర్ తమ్ముళ్ళు నోరు కూడా విప్పలేకపోతున్నారు.

బీజేపీ నేతలు మొదటి నుంచి టీడీపీ నేతలపైనే గురిపెట్టారు. ఎలాగూ టీడీపీ పోటీ చేయడం లేదు కాబట్టి ఆ ఓట్లు తమకు పడేట్లుగా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్నది ప్రచారం కాదు వాస్తవమేనని బీజేపీకి వచ్చిన ఓట్లే నిర్ధారణచేశాయి. టీడీపీతో లోపాయికారీ సర్దుబాటు వల్ల తమకు 10 వేల ఓట్లొస్తాయని బీజేపీ సీనియర నేతలు మొదట్లోనే చెప్పారు. అయితే వాళ్ళు కూడా ఊహించని విధంగా 21 వేల చిల్లర ఓట్లు రావటంతో ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి తలోచెయ్యి వేసి బీజేపీ ఓట్లను టీడీపీ, జనసేనలు పెంచినట్లు అర్ధమైపోతోంది.