Begin typing your search above and press return to search.

పౌరసత్వ బిల్లుపై తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఎలా రియాక్ట్ అయ్యాయి?

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:49 AM GMT
పౌరసత్వ బిల్లుపై తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఎలా రియాక్ట్ అయ్యాయి?
X
తీవ్ర చర్చకు తెర తీసి.. పార్లమెంటుతో పెద్ద ఎత్తున భావోద్వేగాల్ని రగిలించిన పౌరసత్వ బిల్లును బీజేపీ తాను కోరుకున్నట్లే ఆమోదముద్రను వేయించుకోగలిగింది. ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో.. ఓటింగ్ వేళలోనూ పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టిన ఈ బిల్లుపై తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు విభిన్నంగా రియాక్ట్ అయ్యాయి.

తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు వివక్షతో కూడిందని వాదించారు. ముస్లిం మైనార్టీలను కూడా బిల్లు పరిధిలో చేర్చాలన్న ఆయన లేకుంటే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. తాము మైనార్టీలకు అండగా ఉంటామంటూ ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన వాదనను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడటం గమనార్హం. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ బిల్లుపై అర్థరాత్రి జరిగిన ఓటింగ్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇక.. ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం అనుకూలంగా ఓటు వేశారు. ఎప్పటిలానే ఈ బిల్లు విషయంలో టీడీపీ ఏటూ తేల్చుకోలేకపోయింది. టీఆర్ఎస్ మాదిరి వ్యతిరేకించకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ మాదిరి సమర్థించకుండా.. ఈ బిల్లుపై ఏపీ విపక్ష పార్టీ చీలిపోయింది. పార్టీకి చెందిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే.. మరో సభ్యుడు కేశినేని నాని మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కనుక తాను మద్దతు ఇవ్వటం లేదన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు పౌరసత్వ బిల్లు విషయంలో విభిన్నంగా వ్యవహరించాయి.