Begin typing your search above and press return to search.

షారుఖ్ కుమారుడు ఆర్యన్ కు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఎలా లభించింది?

By:  Tupaki Desk   |   27 May 2022 9:42 AM GMT
షారుఖ్ కుమారుడు ఆర్యన్ కు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఎలా లభించింది?
X
గత ఏడాది అక్టోబర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయకుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి క్రూయిజ్ షిప్ లో పార్టీ లో ఉండగా ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ పార్టీలో డ్రగ్స్ పట్టుబడడంతో ఆర్యన్ ను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 7న ఆర్యన్ ను జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని వారాల తర్వాత ఆర్యన్ కు బెయిల్ లభించింది.

ఈ కేసులో చార్జ్ షీట్ నమోదు చేసే క్రమంలోనే విచారణ చేశారు. విచారణలో ఎన్సీబీ అధికారుల దుందుడుకు స్వభావంపై కూడా విమర్శలు రావడంతో పలువురు బదిలీ అయ్యారు. ఎన్సీబీ డైరెక్టర్ ను కూడా ఆరోపణలపై తప్పించాల్సి వచ్చింది.

ఇక విచారణలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడా? లేదా? అనేది క్లారిటీ రాలేదు. దీంతో కేసు విషయంలో షారుఖ్ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సమయంలో చాలా మంది బాలీవుడ్ తారలు షారుఖ్-గౌరీఖాన్ దంపతులను పరామర్శించారు. అప్పటి నుంచి షారుఖ్ తన పలుకుబడిని ఉపయోగించి ఈ కేసుపై లాయర్లు, ఇతరులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. అనుకున్నట్టు కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించేలా చేయడంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.

ఆర్యన్ ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ డైరెక్టర్ పై వేటు పడడం.. కొత్త అధికారులు రావడం.. బలమైన న్యాయవాదులతో షారుఖ్ వాదించేలా చేయడంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా షారుఖ్ కు సహకరించిందన్న గుసగుసలు ముంబై సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే సాక్ష్యాధారాలు ఏవీ దొరకకపోవడంతో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించినట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించడంతో షారుఖ్ ఫ్యామిలీ ఈరోజు సంబరాలు చేసుకుంటోంది. నేడు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రంఖాన్ పుట్టినరోజు కావడంతో ఈ సంబరం రెట్టిపైంది. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వాడలేదు అని క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం. దీంతోనే చార్జ్ షీట్ లో ఆర్యన్ ఖాన్ పేరు నమోదు చేయలేదు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడు అనేదానికి సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆర్యన్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు ఎన్సీబీ అధికారులదా? లేక ఆర్యన్ ఖాన్ దా? అన్న దానిపై ఎవరికి వారు కామెంట్స్ చేస్తున్నారు.