Begin typing your search above and press return to search.

100 మంది డాక్ట‌ర్లు... 50 గంట‌ల క‌ష్టం స‌క్సెస్‌

By:  Tupaki Desk   |   20 July 2019 10:32 AM GMT
100 మంది డాక్ట‌ర్లు... 50 గంట‌ల క‌ష్టం స‌క్సెస్‌
X
అవిభక్త కవలను అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు వీణ-వాణిలు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కవలలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది డాక్ట‌ర్లు ఈ కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మన వీణ-వాణిల కంటే ఈ పాకిస్తానీ వీణా వాణిలు చాలా అదృష్టవంతులే అని చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే పాకిస్తాన్‌ లోని చార్స‌ద్దా ప్రావీన్స్‌ కు చెందిన సఫా, మార్వా కూడా అవిభ‌క్త క‌వ‌ల‌లుగా పుట్టారు.

వీరి శ‌రీరంలో క్రానియోపాగస్ (తలలు కలిసి పుట్టడం) కావడంతో వీరిని శ‌స్త్ర‌చికిత్స ద్వారా వేరే చేసేందుకు ఏ డాక్ట‌ర్ కూడా సాహ‌సం చేయ‌లేదు. దీంతో వీరి త‌ల్లిదండ్రులు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేకుండా పోయింది. స‌ఫా, మార్వా పుర్రెలు, రక్తనాళాలు కలిసి పుట్టడంతో.. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా లాభం లేదన్నారు. ఎట్ట‌కేల‌కు వీరికి లండ‌న్లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు వీరికి శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

ప్ర‌పంచంలోనే అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు సంబంధించిన శ‌స్త్ర‌చికిత్స‌లు చేయ‌డంలో ఈ హాస్ప‌ట‌ల్‌కు పేరుంది. ఈ క్ర‌మంలోనే స‌ఫా, మార్వాల‌ను విడ‌దీసేందుకు లండ‌న్‌లోని 100 మంది అత్యున్నతస్థాయి వైద్యుల బృందం 50 గంటల పాటు కష్టపడింది. అత్యంత సంక్లిష్ట‌మైన ఈ శ‌స్త్ర‌చికిత్స స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు వారి క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం దక్క‌డంతో పాటు అక్కా చెల్లెళ్లు సఫా, మార్వాలు ప్రస్తుతం స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు.

ఇక గ్రేట్ ఆర్మాండ్ హాస్పిటల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ఐదుగురు అవిభక్త కవలల్లో ఇద్దరు పురిట్లోనే చనిపోతున్నార‌ట‌. అవిభ‌క్త క‌వ‌ల‌లు పుట్టాక 24 గంట‌లు గ‌డిస్తే కాని వారు జీవిస్తారో... మ‌ర‌ణిస్తారో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక అవిభ‌క్త క‌వ‌ల‌ల్లో కొంద‌రు కాళ్లు, చేతులు క‌లిసి పుడుతుంటే ఐదు శాతం మంది మాత్రం తలలు కలిసి పుడుతున్నారు. త‌ల‌లు క‌లిసిన‌ప్పుడు మాత్రం అవిభ‌క్త క‌వ‌ల‌లు ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.