Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ వీడియోలు ఎలా బయటకొచ్చాయి?

By:  Tupaki Desk   |   16 Jun 2022 6:30 AM GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ వీడియోలు ఎలా బయటకొచ్చాయి?
X
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన రొమేనియా బాలిక గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లతోపాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ ను తమ అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే వారితో రెండు రోజుల క్రితం సీన్ క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ చేశారు.

అయితే అసలు బాలికతో కారులో అసభ్యంగా ప్రవర్తించింది, గ్యాంగ్ రేప్ వీడియోలు ఎలా బయటకొచ్చాయనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీడియోలను సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ ల్లో వైరల్ చేసిందెవరో తెలుసుకునే పనిలో ఉన్నారు. వాటిని డిలీట్ చేయాల్సిందిగా ఇప్పటికే ఆయా సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశారు.

అయితే ఒకరిపై ఒకరు ద్వేషంతో, పక్కవాళ్లను ఇరికించడానికి నిందితులే ఒకరికి తెలియకుండా ఒకరు వీడియోలు తీసుకున్నారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించేటప్పుడు, ఆమెను అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు తీసుకున్నారు. వీటిని వారే తమ సన్నిహితులకు పంపారని సమాచారం. అలా ఒకరి ద్వారా ఒకరికి సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ ల్లోకి ఆ వీడియోలు చేరాయని తెలుస్తోంది.

వీడియోలను వాట్సాప్ ల్లోకి, ఫేస్ బుక్ ల్లోకి, యూట్యూబ్ ల్లోకి పంపిన సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా నిందితులను పోలీసులు ప్రశ్నించారు. అయితే వారు సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోయారని అంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వీడియోల వ్యవహారం తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఒకరి నుంచి ఒకరికి ఈ వీడియోలను పంపుకున్నారని తెలుస్తోంది.

అలాగే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఈ నిందితుల పూర్తి వ్యవహారశైలిని తెలుసుకునేందుకు వారి ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ తదితర అకౌంటన్లు పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఆరుగురు నిందితుల ఫోన్లను తీసుకుని తనిఖీ చేస్తున్నారు.

నిందితుల వాట్సాప్ సంభాషణలు, రోజువారీ అలవాట్లు, ధూమపానం, కళాశాలలో వారి ప్రవర్తన వంటి అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని మానసిక నిపుణుల ద్వారా విశ్లేషిస్తున్నారు. దీని ఆధారంగా చార్జిషీటులో ఆ వివరాలను కూడా పొందుపర్చునున్నారు.