Begin typing your search above and press return to search.

జగన్ వస్తే ఇన్ని కష్టాలా.. విచారణకు ఆదేశం

By:  Tupaki Desk   |   10 Feb 2022 10:30 AM GMT
జగన్ వస్తే ఇన్ని కష్టాలా.. విచారణకు ఆదేశం
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖ వచ్చారు. వెళ్లారు. సరిగ్గా అయితే ఆయన సుమారు నాలుగు గంటల పాటు శారదాపీఠంలోనే ఉన్నారు. మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకూ పీఠంలోనే ఆయన గడిపారు. మరి జగన్ అక్కడ ఉంటే పోలీసులు కూడా ఆయనతో ఉంటారు. అదే టైమ్ లో ట్రాఫిక్ పోలీసులు కూడా తమ పనిలో బిజీగా ఉంటారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కష్టాలు కడగండ్లూ ఎవరివీ అంటే సగటు ప్రజలవి.

ముఖ్యమంత్రి వెళ్లే మార్గం అంటే ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం దాకా ఉన్న మార్గాన్ని దారి మళ్ళించి పోలీసులు జనాలను అష్టకష్టాల పాలు చేసారు. ప్రతీ నిత్యం విశాఖలోని లక్షల జనం ప్రయాణించేది ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ రోడ్డు, అలాగే గాజువాక నుంచి సిటీలోకి ఎంట్రీ ఇచ్చేవారుంటారు. కంచరపాలేం, పెందుర్తి నుంచి ఆర్టీసీ కాంప్లెస్ కి నిత్యం లక్షలాది మంది ట్రావెల్ చేస్తారు.

మరి వీరిని దారి మళ్ళింపు పేరుతో పోలీసులు నరకం చూపించారు. సీఎం రాకకు ఇబ్బంది లేకుండా ఆ వైపు రోడ్స్ బ్లాక్ చేశారు. దాంతో హెల్ ఇష్యూస్ ఉన్న వారు కానీ ముఖ్యమైన పనులు ఉన్న వారు కానీ నానా ఇబ్బందులు పడ్డారు. ఇక విశాఖ ఎయిర్ పోర్టు కి వెళ్లేవారు అయితే ఏకంగా పరిగెట్టుకుంటూ వెళ్లారు.

సీఎం టూర్ అంటే ఇంతలా సగటు జనాలకు వేధింపులా అని విశాఖ వాసులు పోలీసుల మీద మండిపోయారు. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న జగన్ పోలీసుల తీరు మీద సీరియస్ అయ్యారు. దానిమీద విచారణకు ఆదేశించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

సరే ముఖ్యమంత్రి ఆగ్రహం, ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ షరా మామూలే అయినా అసలు నరకం చూసిన వారి పరిస్థితి ఏంటి. ఆ విలువైన టైమ్ మొత్తం పనులు జరగక అటు ఇటూ కాక చిక్కుపోయిన వారు, అనారోగ్యంతో దారి మధ్యలో ఉండిపోయి ఆసుపత్రులకు వెళ్లని వారికి ఓదార్పు ఎవరు ఇస్తారు.

నిజంగా జగన్ పర్యటన షెడ్యూల్ పోలీసుల వద్ద ఉందా. లేక సీఎం చెప్పిన టైమ్ కంటే ఎక్కువ పీఠంలో గడిపారా అన్నది చూడాలి. అయితే సీఎం టూర్ ఉన్నా కూడా జనాలను అన్నేసి గంటల సేపు ట్రాఫిక్ చిక్కుల్లో పెట్టడం మాత్రం మంచి విధానం కాదు. గతంలో ఇలా ఎపుడూ జరగలేదు. దాంతో ముఖ్యమంత్రి జగన్ కూడా దీని మీద సీరియస్ అయ్యారు. మరి విచారణలో ఎవరి అతి ఉత్సాహం ఈ పని చేయించిందో చూడాల్సి ఉంది.