Begin typing your search above and press return to search.

ఆ సీన్ ను సీఎం జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో?

By:  Tupaki Desk   |   7 April 2022 4:29 AM GMT
ఆ సీన్ ను సీఎం జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో?
X
ఒక ముఖ్యమంత్రి ఎంత తోపు.. తురుంఖాన్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో అడుగు ముందుకు వేయటానికి సవాలచ్చ ఆలోచిస్తారు. తన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే మంత్రుల్ని ఒక్కసారిగా పీకి పారేసి.. కొత్త వారిని ఎంపిక చేసుకోవటం అంత సామాన్య విషయం కాదు.

కోపంతోనో.. అసహనంతోనో.. మరే కారణంతోనో మంత్రివర్గం మొత్తాన్ని తీసిపారేసి.. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయటం లాంటివి ఇప్పటివరకు జరిగినా.. మంత్రులతో మంచి సంబంధాలు ఉంటూనే.. పాలనలో అర్థభాగం అయ్యాక మంత్రులందరి చేత రాజీనామా చేయించి కొత్త టీంను ఎంపిక చేసుకునే సరికొత్త ప్రయోగం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమనుకోవాలి.

అంతేనా.. తన మంత్రుల చేత రాజీనామా చేయించేందుకు ముందు వారందరిని ఒక చోట సమావేశ పరిచి.. తన భవిష్యత్తు ప్లాన్ వారికి షేర్ చేసి.. మీరంతా రాజీనామా చేయండి.. మంత్రి పదవుల్ని వదిలిపెట్టండన్న మాట చెప్పేందుకు ఎంతటి మొనగాడు సీఎం అయినా కాస్తంత మొహమాటపడతారు. నోటి నుంచి ఆ మాటను చెప్పేందుకు తెగ ఇదైపోతారని చెబుతారు. అలాంటి.. అదేమీ లేకుండా మంత్రివర్గ సమావేశం పెట్టి.. మీరంతా మీ పదవులకు రాజీనామా చేసేయండి.. అని చెప్పేసే సత్తా మాత్రం సీఎం జగన్ కు మాత్రమే సాధ్యమంటున్నారు.

ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం మూడు గంటలకు తన కాబినెట్ తో ఆఖరి మీటింగ్ ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎజెండాను సిద్ధం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను జగన్ కోరుతారని.. ఇలాంటి గంభీరమైన సన్నివేశాన్ని ఎదుర్కోవటానికి.. తనకెంతో సన్నిహితులు.. ఆత్మీయులను పదవుల నుంచి తప్పుకోమని చెప్పటం ముఖ్యమంత్రికి కష్టమని.. అయినప్పటికీ ఆయన అందుకు ప్రిపేర్ కావటం గొప్పేనన్న మాటను పలువురు చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న 25 మంది మంత్రులను ఒకేసారి రాజీనామా చేయించి.. ఈ నెల 11న కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెబుతున్నారు. ఇందుకుగాను.. పాత మంత్రుల్లో నలుగురిని మాత్రం కొత్త మంత్రివర్గంలోనూ తీసుకునే వీలుందని చెబుతున్నారు.

దీనిపై పలువురు మంత్రులు కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ కు పాతిక మంది మంత్రులు వస్తే ఓకే.. ఎవరైనా రాకుంటే అదో ఇష్యూగా మారుతుంది. అలాంటి సన్నివేశానికి సిద్ధమైన జగన్ ధైర్యాన్ని మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు పొగిడేస్తున్నారు. ఏమైనా.. సన్నిహితులు.. ఆత్మీయులు.. కలిసి జర్నీ చేసిన వారిని పదవుల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంత తేలికైన విషయం కాదన్నది నిజం.