Begin typing your search above and press return to search.
చావు భయం ఎలా ఉంటుందంటే..?
By: Tupaki Desk | 29 Oct 2015 10:30 PM GMTచావు ఏ జీవికైనా భయానకమే... అది అనుభవిస్తే కానీ తెలియదు.. అనుభవించిన తరువాత ఆ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం ఉండదు. అందుకే చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే... మనిషి మరణించేటప్పుడు మెదడు పనిచేసే తీరు, దాని స్పందన ఎలా ఉంటుందన్నది వివరిస్తూ అమెరికన్ కెమికల్ సొసైటీ ఒక వీడియోను విడుదల చేసింది. అదిప్పుడు ఇంటర్నెట్ లో 'డెడ్లీ'గా స్ప్రెడ్ అవుతోంది.
సినిమాల్లో భయంకరమైన సన్నివేశాలు వస్తేనే చాలామంది భయపడతారు. ఇక కళ్ల ముందు మృత్యువు కనిపిస్తే దానికి భయం కంటే పెద్ద పదమే వాడాలి. తీవ్ర భయాన్నిమెదడులోని థలామస్ అనే భాగం నియంత్రిస్తుంటుందట. మెదడు కణాల్లోని క్లస్టర్ ద్వారా ఈ ఫీలింగ్ ను నియంత్రించవచ్చునని వీడియో ద్వారా అర్థమవుతోంది. మెదడులోని థలామస్ ప్రాంతం సున్నితంగా ఉంటుంది. మానసిక - శారీరక ఉద్రిక్తతలకు సెన్సార్ లా పనిచేస్తుంటుంది. ఒత్తిడి, భయంకరమైన సందర్భాల్లో మెదడులోని అడ్రినల్ గ్రంథులు స్పందించి అడ్రినాలిన్ ను విడుదల చేస్తాయి. దీనివల్ల ఉలికిపాటు కలిగి బ్రెయిన్ లో తక్షణ స్పందన ప్రారంభమౌతుంది. ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. ఈ క్రమంలో భారీ మొత్తంలో శక్తి బయటకు వస్తుంది. ఇది ఆయా సందర్భాలను ఎదుర్కొనేలా, తట్టుకునేలా చేస్తుంది. ఇలాంటప్పుడు అప్రయత్నంగానే కేకలు, అరుపులు వస్తాయి.
కెమికల్ సొసైటీ విడుదల చేసిన ఈ వీడియో టైటిల్ ''సో నౌ యు ఆర్ డెడ్ ఆన్ ద ఫ్లోర్''.. క్లినికల్లీ డెడ్ అయిన పరిస్థితుల్లోనూ మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుందని.. స్పృహతో మెదడుకు సంబంధం ఉండదని, చివరి క్షణం వరకూ పనిచేస్తూనే ఉంటుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చావును కళ్ల ముందు నిలిపేలా చిత్రీకరించిన ఈ వీడియో ఆసక్తి కలిగిస్తోంది.