Begin typing your search above and press return to search.

మోదీ అమెరికాలో సెట్ చేసేశాడు బాస్‌

By:  Tupaki Desk   |   25 Sep 2019 4:35 PM GMT
మోదీ అమెరికాలో సెట్ చేసేశాడు బాస్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో దౌత్య‌ప‌రంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారత్‌ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవ‌డాన్ని ప్రాధాన్య‌మైన అంశంగా తీసుకున్న మోదీ...ఈ క్ర‌మంలో న్యూయార్క్‌ లో బ్లూంబర్గ్‌ సమ్మిట్‌ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాలుగు ముఖ్య‌మైన అంశాల‌కు వేదిక‌గా... భార‌త్ ఉంద‌ని పేర్కొంటూ...ఇలాంటి ప్రాంతం మ‌రొక‌టి లేద‌ని తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని, పరిస్థితుల అనుకూలత - డిమాండ్‌ ఉందన్న ప్ర‌ధాని...వీట‌న్నింటి వ‌ల్ల భారత్‌ లో పెట్టుబడులకు భరోసా ఉందన్నారు.

భారత్‌ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు త్వరలోనే భారత్‌ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌ హైజర్‌.. భారత్‌ తో సంప్రదింపులు జరుపుతున్నారని - త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. ఈ అంశాల‌ను పేర్కొంటూ...ఇండియా మీ అందరి కోసం ఎదురుచూస్తోందని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రకృతి వనరులను అవసరాలకు వాడుకోవాలి తప్పితే.. స్వార్థంతో కబళించకూడదని.. తాము నమ్ముతామని అన్నారు. అందరూ మెచ్చే గమ్యస్థానం ఇండియానే అని - పెట్టుబడులతో రావాలని - అభివృద్ధిని పంచుకుందామని మోదీ అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపు ఇచ్చారు.

పెట్టుబడులకు ప్ర‌స్తుత స‌మ‌యం మహత్తర అవకాశమని మోదీ విశ్లేషించారు. త‌మ దేశంలో రాజకీయ స్థిరత్వం వచ్చాక.. పెట్టుబడులకి - అభివృద్ధికి అవకాశాలు పెరిగాయన్నారు. గత ఐదేళ్ల అనుభవంతో మరింత స్పష్టంగా - బలంగా.. భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించామని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌ లకు ఇండియాలో లభిస్తున్నంత ప్రోత్సాహం మరెక్కడా లేదన్నారు. 20 శాతానికి పైగా వృద్ధిరేటుతో విమానయానం విస్తరిస్తోందన్నారు. ఇండియాలో ఇప్పుడు ప్రతి నగరానికి విమాన సర్వీసులున్నాయని - విమానయానంలో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని మోదీ స్పష్టం చేశారు.

కాగా, కీల‌క‌మైన వాణిజ్యం విష‌యంలో...ఇరు దేశాల మ‌ధ్య పేచీ కొన‌సాగుతోంది. ఉక్కు - అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలను తగ్గించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తున్నది. ప్రాధాన్య హోదా కల్పిస్తున్న రాయితీలను పునరుద్ధరించాలని కోరతున్నది. మరోవైపు అమెరికా తమ వ్యవసాయ - తయారీ ఉత్పత్తులు - డైరీ ఉత్పత్తులు - వైద్య పరికరాలకు మెరుగైన మార్కెట్‌ కల్పించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తున్నది. ఐసీటీ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని కోరుతోంది. ఈ అంశాల్లో వ‌చ్చే వాటి ఆధారంగానే...ప్ర‌ధాని అమెరికా టూర్ స‌ఫ‌లం ఆధార‌ప‌డి ఉండ‌నుంది.