Begin typing your search above and press return to search.

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమెంత?

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:02 AM GMT
ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమెంత?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను నేడు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ తన ఉనికిని గట్టిగా చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పాగా వేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలలో తమ కార్యకలాపాలు మొదలవుతాయని ప్రకటించారు కూడా.

అయితే, 2019 ఎన్నికల్లో జగన్ కు అండాదండగా నిలిచిన కేసీఆర్ కు ఇప్పుడు జగన్ సాయం చేసే పరిస్థితి లేదు. పరోక్షంగా మోడీ సర్కార్ కు జగన్ బేషరతుగా మద్దతిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం అనేది కేసీఆర్ కు కత్తి మీద సామువంటిదే. అందులోనూ, జనసేన ప్రత్యక్షంగా...టీడీపీ పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పొరుగురాష్ట్రంలో బీఆర్ఎస్ ది నల్లేరు మీద నడక కాదు.

ఈ క్రమంలోనే ఏపీలో పాగా వేసేందుకు కేసీఆర్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఏపీలో బహిరంగ సభలో ఏర్పాటు చేసి తమ పార్టీ ఉనికిని చాటేందుకు కేసీఆర్ ప్రయత్నించబోతున్నారట.

ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక నేతలతో కేసీఆర్ చర్చించారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారట.

వచ్చే ఏడాది జనవరిలో గుంటూరు లేదా విజయవాడలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిన కాంగ్రెస్ నేతలు మినహా టీఆర్ఎస్ కు మిగతా నేతలు మద్దతిచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అదీగాక, గత రెండు ఎన్నికల సందర్భంగా ఏపీ నేతలపై విమర్శలు గుప్పించిన కేసీఆర్...ఇప్పుడు పార్టీ పెడుతున్నా అంటూ వస్తే ఆదరించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు.

అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా ఉంటోన్న కేంద్రాన్ని తాము నిలదీస్తామని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరానికి నిధుల విడుదలలో జాప్యం, రైల్వే జోన్, మూడు రాజధానుల వ్యవహారం వంటి సమస్యలు ఎజెండాగా ప్రజలను కేసీఆర్ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీలో బీఆర్ఎస్ ది కేక్ వాక్ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.