Begin typing your search above and press return to search.

ఈ నాలుగో సింహం ఇంత రిచ్ ఎలా అయ్యిందో తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   12 July 2022 2:30 AM GMT
ఈ నాలుగో సింహం ఇంత రిచ్ ఎలా అయ్యిందో తెలిస్తే షాకే
X
ఇంకొకరి భార్య మీద కన్నేసి.. తాను టార్గెట్ చేసింది సొంతం చేసుకోవాలన్న కసితో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ విననంత దుర్మార్గానికి తెర తీసిన మాజీ సీఐ (ఈ ఆరోపణలతో సస్పెండ్ కావటం తెలిసిందే) నాగేశ్వరరావుకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. పోలీసు శాఖలో కీలక స్థానంలో ఉంటే ఎలాంటి చెత్త పనులైనా ఇట్టే చేసుకోవచ్చన్న విషయం నాగేశ్వరరావుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్నట్లుగా బయటకు వస్తున్న వివరాలున్నాయి.

రకరకాల దందాలు.. సెటిల్ మెంట్లతో కోట్లాది రూపాయిల అక్రమార్జనే లక్ష్యంగా తెర తీయటమే కాదు.. తాను చేసే సెటిల్ మెంట్ల వసూళ్లకు ఇద్దరు.. ముగ్గురు ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకునే వరకు నాగేశ్వరరావు లీలలు చేరాయన్న వాస్తవం ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి. తీవ్రమైన ఆరోపణలతో సస్పెండ్ అయిన అతడికి సంబంధించిన మరిన్ని లీలల్ని తవ్వి తీస్తున్న క్రమంలో బయటకు వస్తున్న వివరాలు పోలీసు శాఖలోని పలువురు అధికారుల్ని సైతం నివ్వెరపోయేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. 2004 బ్యాచ్ కు చెందిన నాగేశ్వరరావు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైబరాబాద్ కు బదిలీ అయి.. అక్కడి నుంచి హైదరాబాద్ టాస్కు ఫోర్సుకు చేరినట్లుగా చెబుతున్నారు.

తాను ఏ స్థానంలో ఉన్నా.. ఉన్నతాధికారుల మనసును దోచుకోవటంలో అతగాడి టాలెంట్ అంతా ఇంతా కాదంటున్నారు. ఉన్నతాధికారుల్ని ప్రసన్నం చేసుకోవటంతో పాటు.. వారికి అవసరమైన పనుల్ని ముందుగా గుర్తించి.. టాస్కు ఎలాంటిదైనా సరే.. తనకు పని అప్పగించిన వారు కోరుకున్న ఫలితాన్ని ఇవ్వటంలో దిట్టగా చెబుతారు. డ్రగ్స్.. అంతర్రాష్ట్ర గ్యాంగులకు సంబంధించిన కేసుల్లో కీలకంగా వ్యవహరించారని.. పెద్దఎత్తున నెట్ వర్కును ఏర్పాటు చేసి.. దాన్నే తన దందాగా మార్చుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బాధితులు ఉన్నతాధికారుల్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నా.. వారు స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. తాము చెప్పిన పనిని చెప్పినట్లు చేసే నాగేశ్వరరావుకు పేబ్యాక్ తరహాలో.. ఇలా ఫేవర్ చేసేవారని.. అందుకే అతనిపై వచ్చిన ఆరోపణల్ని చెత్తబుట్టలో పడేసేవారంటున్నారు.

నాగేశ్వరరావు మీద వస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా పలు సంఘటనల్ని ప్రస్తావిస్తున్నారు. రెండేళ్ల క్రితం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఒక ప్రముఖ హోటల్లో ఒక పెద్ద పండుగ రోజున టాస్కుఫోర్సు దాడులు చేయటం.. అందులో పేకాట ఆడుతున్న బడా బాబుల్ని బుక్ చేసినట్లు చెబుతున్నారు. ఈ డీల్ లో వచ్చిన అమౌంట్ పై అప్పట్లో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా గుర్తు చేసుకుంటున్నారు. విధి నిర్వహణ పక్కాగా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. పెద్ద డీల్స్ చేస్తూ భారీగా సంపాదించాడని.. ఆ డబ్బును తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెట్టినట్లుగా చెబుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ల ప్రకారం రూ.200 కోట్లు ఇప్పుడున్న అతని ఆస్తుల విలువగా కొందరు అభివర్ణిస్తే.. మరికొందరు మాత్రం రూ.100 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. ఈ అంకెల్ని పక్కన పెడితే.. సెటిల్ మెంట్లు.. దందాలతో భారీగా డబ్బు వెనకేసుకున్నారన్న మాట పలువురు పోలీసులు అధికారుల నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం. మరి.. తాజాగా జరుగుతన్న విచారణలో ఈ విషయాల మీద ఫోకస్ చేస్తారో లేదో చూడాలి.