Begin typing your search above and press return to search.

నిర్భయ దోషుల లాయర్ ఎంతటి ఘనుడంటే ?

By:  Tupaki Desk   |   21 March 2020 7:03 AM GMT
నిర్భయ దోషుల లాయర్ ఎంతటి ఘనుడంటే ?
X
నిర్భయ కేసు ..గత కొన్నేళ్లుగా దేశంలో ఈ మారుమోగుతూనే ఉంది. అయితే , ఎట్టకేలకి అనేక మలుపుల తరువాత నలుగురు దోషులని మార్చి 20 న తెల్లవారు జామున ఉరి తీశారు. అయితే , ఈ కేసులో నిర్భయ పేరు తరువాత అంత ఎక్కువగా వినిపించిన మరో పేరు దోషుల లాయర్ అజయ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ ఏపీ సింగ్. దాదాపు ఏడేళ్లుగా దేశంలో మారుమోగుతోన్న పేరిది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల తరుఫున వాదించిన ఆయన..దోషులకు ఉరి శిక్షని తప్పించాలని చివరి నిమిషం దాకా అనేక ప్రయత్నాలు చేశారు. దేశంలో అత్యున్నత కోర్టు నుంచి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ , అయన ప్రయత్నాలు ఫలించలేదు.

శిక్షల అమలు తర్వాత చనిపోయిన నిర్భయపై, బతికున్న ఆమె తల్లి ఆశాదేవిపై అడ్వొకేట్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిర్భయ లాంటి కూతురు తనకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేవాణ్నని, నిర్భయ లాంటిదే మరో కేసు చేతికొచ్చినా ఇదే రకమైన ప్రయత్నాలు చేస్తానని గతంలో బాహాటంగా ప్రకటించారాయన. తనను మహిళా ద్వేషి అని విమర్శించేకంటే.. పురుష పక్షపాతిగా చూడాలని ఏపీ సింగ్ కోరారు. అసలు అయన ప్రస్థానం ఎలా మొదలు అయ్యిందో ఒకసారి చూస్తే ...

క్నోలోని రాంమనోహర్ లోహియా నేషనల్ లా వర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి క్రిమినాలజీలో డాక్టరేట్ కూడా పొందారు. 1997లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందిన తొలినాళ్లలో ఆయనకు చంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాదాస్పద తాంత్రికుడిగా, అప్పటి ప్రధాని పీవీకి ఆథ్యాత్మిక సలహాదారుగా, అటు దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా లీడర్లతోనూ దగ్గరి సంబందాలున్న వ్యక్తిగా చంద్రస్వామి పేరుగాంచారు. ఆ గురువుగారు కొనిచ్చిన డ్రెస్ ధరించే ఏపీ సింగ్ లాయర్ గా తొలి కేసు వాదించారు. వివిధ కేసుల్లో చంద్రస్వామి దోషిగా నిర్దారణ అయి, 2017లో చనిపోయేదాకా ఆయనతో ఏపీ సింగ్ అనుబంధం కొనసాగింది.

తాను రాజ్‌పుత్ నని గర్వంగా చెప్పుకునే ఏపీ సింగ్.. మనిషికి పరువు కంటే మించింది ఏదీ లేదని అంటారు. దేశంలో ఆత్మహత్యకు పాల్పడేవాళ్లలో ఎక్కువ మంది మగాళ్లేనని, అందులోనూ మహిళల కారణంగా చనిపోతున్నవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన వాదిస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాదిరిగా మగవాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎన్నో సార్లు తెర పైకి తీసుకువచ్చారు. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాలేదు. తాము కేసును టేకప్ చేయబోమని పలు బార్ అసోసియేషన్లు బాహాటంగా ప్రకటించాయి. నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌ భార్య పునీతా దేవి తొలుత ఏపీ సింగ్ ను కలవగా.. కేసు తీసుకోబోనని వెనక్కి పంపించారు.

అయితే, సింగ్ దగ్గర జూనియర్ గా పనిచేస్తోన్న లాయర్ ద్వారా.. మదర్ సెంటిమెంట్ గురించి తెలుసుకున్న ఓ తీహార్ జైలు అధికారి.. ఆ సమాచారాన్ని అక్షయ్ కుటుంబానికి చేరవేశాడు. దీంతో అక్షయ్ భార్య పునీతా నేరుగా ఏపీ సింగ్ తల్లి విమలా సింగ్ ను కలిసి వేడుకున్నారు. ఆ తరువాత సింగ్ అమ్మ ఆ కేసును టేకప్ చేయాలని కోరడంతో కాదనలేని స్థితిలో ఆయన నిర్భయ కేసు లోకి ఏపీ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. మహాత్ముడి సిద్ధాంతాలను క్షుణ్నంగా చదివానని చెప్పుకునే ఏపీ సింగ్.. ఒక వ్యక్తిని చట్టబద్ధంగా చంపడం గాంధీ ఫిలాసఫీకి విరుద్ధమని, శిక్షలు అనేవి దోషులు పరివర్తన చెందడానికే తప్ప చంపడానికి కాదని అయన చెప్తారు. ఈ ఏడేళ్ల కాలంలో చాలా మంది జడ్జిలు ఏపీ సింగ్ వాదనలతో విభేదిస్తూ ఆయనను తప్పుపట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.