Begin typing your search above and press return to search.

షాకింగ్ ..ఆ కుటుంబ సభ్యులకి కరోనా ఎలా సోకింది ?

By:  Tupaki Desk   |   2 May 2020 7:50 AM GMT
షాకింగ్ ..ఆ కుటుంబ సభ్యులకి కరోనా ఎలా సోకింది ?
X
కరోనా మహమ్మారి ఎప్పుడు , ఎవరి నుండి ఎలా సోకుతుందో కూడా కనిపెట్టడం కష్టం అవుతుంది. మనం బయటకి వెళ్లిన సమయంలో మన పక్క నుంచి వెళ్లే వారిలో ఎవరికి వైరస్‌ ఉందనేది తెలియదు. మర్కజ్ ..ఎన్నారై సంబంధాలు లేకున్నా కూడా ఈ మధ్య చాలా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి కేసే తాజాగా ఒకటి కర్ణాటక లో బయటపడింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే..

మాండ్య జిల్లాకు చెందిన ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ ముంబయిలో నివాసం ఉంటున్నాడు. అయితే , అతను గుండె పోటుతో ఇటీవలే మృతి చెందాడు. దీనితో అధికారుల అనుమతి తీసుకుని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సొంత జిల్లా మాండ్యకు తరలించారు. మృతదేహంతో పాటు ఆరుగురు ప్రయాణించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్గం మధ్యలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడికి వీరు లిఫ్ట్‌ ఇచ్చారు. అయితే డ్రైవర్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరుగురిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అంతే కాదు.. మధ్యలో వాహనం ఎక్కిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీనితో వీరికి ఎలా కరోనా సోకింది అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. డ్రైవర్‌ కుమారుడు ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అతని ద్వారానే కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మధ్యలో ఎక్కిన మహిళ ద్వారా వ్యాపించిందా అనేది తెలియాలి. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఎవరెవరికి కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. కాగా అంత్యక్రియలకు హాజరైన వారంతా భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటన పై మాండ్య డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ ఎంవీ వెంకటేశ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మృతదేహం వెంట ఆరుగురికి ఎందుకు అనుమతిచ్చారని , కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. కంటైన్‌మెంట్‌ జోన్‌ నుంచి ఎలా బయటకు ఎలా పంపిస్తారని ముంబయి అధికారులను ఆయన ప్రశ్నించారు.