Begin typing your search above and press return to search.

మీడియా మీట్ లో బైడెన్ తీరు ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   28 Aug 2021 4:33 AM GMT
మీడియా మీట్ లో బైడెన్ తీరు ఎలా ఉందంటే?
X
తప్పు చేస్తే ఒప్పుకోవటం చాలా తక్కువ మందిలో చూస్తాం. అందునా.. రాజకీయాల్లో ఉన్న వారు.. అత్యున్నత స్థాయిలో ఉన్న వారు తమ కారణంగా జరిగిన తప్పులను ఒప్పుకోవటానికి ఒక పట్టాన ఇష్టపడరు. ఆ మాటలకు వస్తే.. మన దేశంలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పుల్ని చూస్తే.. ప్రభుత్వానికి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైతే.. దానికి సమాధానం చెప్పే కన్నా.. దాని నుంచి తప్పించుకోవటానికి వారు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. మీడియా కంట పడకుండా ఉండటం.. జరుగుతున్న పరిణామాల మీద వివరణ ఇవ్వటానికి అస్సలు ఇష్టపడరు.

మన దగ్గర ఇలా ఉండొచ్చు. అగ్రరాజ్యం మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన జంట పేలుళ్లలో భారీ ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 200 మంది మరణిస్తే.. అందులో 13 మంది అమెరికన్ సైనికులు ఉండటంతో.. బైడెన్ ప్రభుత్వంమీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అఫ్గాన్ ఎపిసోడ్ లో తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ వారి మీద మండిపాటు ఎక్కువ అవుతోంది.

ఇలాంటివేళ.. మీడియాసమావేశాన్ని ఏర్పాటు చేసిన బైడెన్.. గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. బైడెన్ సర్కార్ వైఫల్యం అంటూ విరుచుకుపడుతున్న ప్రశ్నలతో పాటు.. అఫ్గాన్ విషయంలో వ్యూహాత్మక పొరపాట్లకు అవకాశం ఇచ్చారన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధినేతకు ప్రశ్నలు సంధిస్తున్న మీడియాకు ఒక దశలో సమాధానాలు ఇవ్వలేక.. మౌనంగా ఉండిపోయారు.

తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టేది లేదని.. వారిని వెంటాడతామని.. ఇప్పటికే తమ కమాండోలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా బైడెన్ ప్రకటించారు.అయినప్పటికీ ఆయన మీద ప్రశ్నల వర్షం కురిసింది. ఒకానొక దశలో మౌనంగా ఉన్న ఆయన తలదించుకొన్నారు. ఆమె ముఖంలో దిగులు కొట్టొచ్చినట్లు కనిపించగా.. మాటల్లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఆయన తీవ్ర ఉద్వేగానికి గురైనట్లుగా కనిపిస్తోంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉన్న ఆయన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తీరుతో.. బైడెన్ క్షమాపణలు కోరారా? అన్నది ప్రశ్నగా మారింది. మన అధినేతలతో పోలిస్తే.. బైడెన్ తీరు బెటర్ గా ఉందని చెప్పాలి. అదే మనోళ్లు అయితే..తమ తప్పును ఒప్పుకోవటం తర్వాత.. రివర్సులో విరుచుకుపడటం ఖాయమని చెప్పక తప్పదు.