Begin typing your search above and press return to search.

రద్దుతో బయటకు వచ్చే బ్లాక్ మనీ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   11 Nov 2016 7:06 AM GMT
రద్దుతో బయటకు వచ్చే బ్లాక్ మనీ ఎంతంటే..?
X
పెద్దనోట్ల రద్దు దేశాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రజల్ని మొత్తంగా షాకిచ్చిన ఈ ఘటన రేపుతున్న సంచలనాలు అన్నిఇన్ని కావు. నిన్నటివరకూ తమ ఆర్థిక స్థితికి పెద్దదిక్కుగా ఉన్న పెద్దనోట్లు ఎందుకు పనికి రాకుండా పోవటం నల్లకుబేరులకు దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. తమ వద్ద పోగుపడిన కుప్పల కొద్దీ నల్లధనాన్ని ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిని తీసుకొచ్చింది. ఊహించని విధంగా విరుచుకుపడిన పెద్దనోట్ల రద్దు షాక్ నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.

కొందరు లక్షకు రూ.70వేల మొత్తాన్నిఇస్తామని చెబుతున్నామరో మాట మాట్లాడకుండా తీసేసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఇక.. మరికొందరైతే పదిగ్రాముల బంగారాన్ని రూ.50వేల చొప్పున పెద్దనోట్లను మార్చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా నల్లధనం ఎంత బయటకు రానుందన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

నల్ల కుబేరుల మీద యుద్ధం ప్రకటించిన మోడీ.. వారికి షాకిచ్చేందుకు తీసుకున్న నిర్ణయంతో ఇంతకాలం ఎక్కడెక్కడో దాచి నల్లధనం మొత్తం కట్టలు కట్టలుగా బయటకు రావటం ఖాయమని చెప్పాలి. మరి.. అలా బయటకు వచ్చే నల్లధనం ఎంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా చెప్పాలి. ప్రజలు తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వీలు ఉండటంతో ఇంతకాలం దాగిన మొత్తం బ్యాంకుల దగ్గరకు రావటం ఒక ఎత్తు అయితే.. పన్నుపోటుకు చిక్కకుండా దాచిన నల్లధనం లెక్క లక్షల కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మోడీ సంచలన నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్ననల్లధనం ఎంత బయటకు వస్తుందన్న విషయంపై ముంబయికి చెందిన డల్ వైజ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒక అంచనా కడుతోంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా ఇదే రీతిలో అంచనాలువేస్తున్నాయి. ఇలాంటి వారి అంచనాల్ని చూస్తే.. దాదాపుగా 4.5 లక్షల కోట్ల రూపాయిలు నల్లధనం బయటకు వచ్చే వీలుందని చెబుతున్నారు.

దేశంలో చలామణిలో న్న 17.8లక్షల కోట్ల విలువైన కరెన్సీలో 86 శాతం రూ.500.. రూ.వెయ్యి కావటం.. వీటిల్లో 80 శాతానికి పైగా కొందరి చేతుల్లోనే ఉందన్న వాదన ఉంది. పరిమిత కాలం తర్వాత పెద్దనోట్లు చిత్తుకాగితాలుగా మారనున్న నేపథ్యంలో తమ వద్ద దాచిన నల్లధనాన్ని ప్రభుత్వానికి జరిమానా చెల్లించి అయినా వైట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి కార్యక్రమంలో తమ దగ్గర దాచి ఉంచిన నల్లధనాన్ని కొంత అపరాధ రుసుమును చెల్లించి వైట్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ.. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద లెక్కలోకి వచ్చిన మొత్తం కేవలం రూ.65,250 కోట్లు మాత్రమే.

అయితే.. తాజాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. నల్లకుబేరులు తమ బొక్కసంలో దాచి ఉంచిన నల్లధనాన్ని బయటకు తీయటం ఖాయమని చెప్పొచ్చు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. దాదాపు రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.9లక్షల కోట్ల వరకూ నల్లధనం లెక్కలు బయటకు వెలుగు చూసే వీలుందని చెబుతున్నారు. మరి.. పలు సంస్థలు చేసిన అధ్యయనాలు నిజమవుతాయో.. మార్కెట్ వర్గాలు వేసిన లెక్కలు సరిపోతాయన్నది కాలమే డిసైడ్ చేయాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/