Begin typing your search above and press return to search.

గంజాయి సాగు వెనుక అసలు కథ

By:  Tupaki Desk   |   13 Oct 2021 7:24 AM GMT
గంజాయి సాగు వెనుక అసలు కథ
X
రాష్ట్రం మొత్తం మీద గంజాయి బాగా పండించే జిల్లా ఏదన్నా ఉందంటే అది కేవలం విశాఖపట్నం మాత్రమే. నిజానికి గంజాయిని పండించటం నిషిద్ధం. కాబట్టి అధికారికంగా అయినా అనధికారికంగా అయినా గంజాయి సాగు ఎక్కడా సాధ్యంకాదు. కానీ మరి విశాఖ జిల్లాలో మాత్రం గంజాయి ఎలా పండుతోంది ? ఎలా సాగు చేయగలగుతున్నారు ? ఎలాగంటే గంజాయి పండించే ప్రాంతంలోకి మామూలు పోలీసులే కాదు ఎలాంటి భద్రతా దళాలు కూడా వెళ్ళే అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణం.

ఏవోబీ అంటే ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లో వేల కిలోమీటర్ల అటవీ ప్రాంతముంది. ఈ ప్రాంతమంతా పూర్తిగా మావోయిస్టుల చేతిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏపీలోని వైజాగ్ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువ. మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లోకి పోలీసులు కూడా పెద్దగా వెళ్ళరు. పోలీసులే వెళ్ళని ప్రాంతాల్లోకి ఇక ఎక్సైజ్ లాంటి పోలీసుల దాడుల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు.

ఎప్పుడైతే మావోయిస్టుల ఏరివేత పేరుతో ప్రత్యేక దళాలు కూంబింగ్ చేయాలని అనుకున్నపుడు మాత్రమే ప్రత్యేక దళాలతో కలిసి రెగ్యులర్ పోలీసులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతారు. ప్రత్యేక కూంబింగ్ అయిపోయిందంటే మళ్ళీ అటువైపు కూడా పోలీసులు తొంగి చూడరు. పోలీసుల దాడులు, నిఘా భయం లేదు కాబట్టే ఇలాంటి దట్టమైన ఏవోబీ ప్రాంతం గంజాయి సాగు జరుగుతోంది.

వేలాది ఎకరాల్లో పండిన గంజాయి సాగును రకరకాల పద్దతుల్లో ప్రాసెస్ చేసి దేశంలోని అనేక ప్రాంతాల్లోకి పంపుతున్నారు. ఈ విధమైన గంజాయి సాగు ఇపుడే కాదు దశాబ్దాలుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మావోయిస్టులదే ప్రాబల్యం కాబట్టి వాళ్ళకు పట్టున్న వేలాది కిలోమీటర్ల ప్రాంతంలోకి పోలీసులు మామూలుగా దాడులు చేయరు ఎవరినీ పట్టుకోరు. ఆ ధైర్యంతోనే స్ధానిక గిరిజనులు గంజాయిసాగును హ్యాపీగా చేసుకుంటున్నారు.

ఈ ప్రాంతంలో సాగు జరిగి ప్రాసెస్ అయిన గంజాయిని దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు పంపుతున్నట్లు సమాచారం. ఏడాది మార్కెట్ విలువ సుమారు రు. 25 వేల కోట్లుంటుందని అంచనా. గంజాయి సాగులో కానీ ప్రాసెసింగ్ లో కానీ స్ధానికంగా ఉండే వందలాది గిరిజనులదే కీలక పాత్రగా అందరికీ తెలుసు. ఏవోబీ ప్రాంతంలో ఇటు ఏపిలో సాగు చేస్తున్నట్లే అటు ఒడిస్సా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున సాగు జరుగుతోంది.

ఈ ఏవోబీ ప్రాంతంలో జరుగుతున్న గంజాయి సాగును కంట్రోల్ చేయాలంటే మామూలు విషయం కాదు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి గంజాయి సాగును పట్టుకో వలసినంత అవసరం ఎవరికుంది ? ఇలాంటివన్నీ సినిమాల్లో చూపిస్తారు కానీ నిజ జీవితంలో సాధ్యంకాదు. మావోయిస్టులకు బాగా పట్టున్న ప్రాంతంలోకి దాడులు చేసి ప్రాణాలతో బయటపడటం అంటే మామూలు విషయంకాదు. అందుకనే అటువైపు కన్నెత్తికూడా చూడరు. ఇలాంటి అనేక కారణాలతోనే గంజాయిసాగు పెద్దఎత్తున జరుగుతోంది.