Begin typing your search above and press return to search.

పవన్ ప్రశ్నించటం ఎలా సాగుతోంది?

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:40 AM GMT
పవన్ ప్రశ్నించటం ఎలా సాగుతోంది?
X
ప్రశ్నించేందుకే తాను రాజకీయ పార్టీని పెట్టినట్లుగా తరచూ చెప్పుకునేవారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే.. తాను పార్టీని పెట్టటానికి కారణమైన ప్రశ్నించే తత్త్వాన్ని చంద్రబాబు హయాంలో ఎందుకు చేపట్టలేదన్న సూటి ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పని పరిస్థితి. విభజన నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో జనసేన పేరుతో పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీలకు మిత్రపక్షంగా వ్యవహరించారు.

ఈ కాంబినేషన్ లో సాగిన ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేసిన పవన్..తమ పార్టీ తరఫున అభ్యర్థుల్ని దింపలేదు.. తాను బరిలోకి దిగలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని పక్కన పెట్టి.. తన సినిమాల్లో మునిగిపోయారు. అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేవారేకానీ.. అదంతా కూడా పార్ట్ టైం జాబ్ అన్నట్లు ఉండేది కానీ.. సీరియస్ పాలిటిక్స్ కు దూరంగా ఉండేవారు.

అక్వా సంస్థలకు కారణంగా కాలుష్యం పెరుగుతోందన్న ఆందోళనతో పాటు..రాజధాని రైతులు.. ఉద్దాణం కిడ్నీ బాధితుల గురించి..ఇలాకొన్ని సమస్యల్ని తెర మీదకు తెచ్చారే కానీ వాటి విషయంలో పెద్ద ఎత్తున పోరాడింది లేదని చెప్పాలి. అంతో ఇంతో ఉద్దాణం కిడ్నీ బాధితుల తరఫున కాస్తంత కసరత్తు చేశారు. అంతలో 2019 ఎన్నికలు రావటం.. అందులో తాను ఒంటరిగా బరిలోకి దిగాలన్న నిర్ణయం తీసుకున్నారు. తాను సైతం రెండు స్థానాల్లో స్వయంగా ఎన్నికల బరిలో దిగారు.
అనూహ్యంగా తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓటమి పాలయ్యారు. ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఊహించని రీతిలో వచ్చిన ఫలితాలు పవన్ ను తీవ్ర నిరాశలో నింపటంతోపాటు.. జనసైనికులకుషాకింగ్ గా మారాయి. బాబు హయాంలో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న పవన్.. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం తర్వాత మాత్రం నిత్యం ఏదో ఒక సమస్యను తెర మీదకు తెస్తున్నారు.

సినిమాలకు దూరంగా ఉంటూ.. తాను పార్టీ పెట్టటానికి మూలకారణమైన ప్రశ్నించే తత్త్వాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు మాటలు తేలిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా పవన్ మాత్రం పలు అంశాల్ని లేవనెత్తుతున్నారు. నిత్యం ఏదో ఒక విషయం మీద మాట్లాడటం చేస్తున్నారు. ఇంగ్లిషును ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లలో పెడతామన్న విషయం మీద కానీ.. ఏపీ రాజధానిని మూడు చోట్ల ఏర్పాటు చేస్తామన్న అంశాలతో పాటు.. రైతుల సమస్యల మీదా.. ఇతర ప్రభుత్వ నిర్ణయాల మీదా ఆయన పోరాడుతున్నారు. మొత్తంగా చూసినప్పుడు ప్రశ్నించటాన్నే ఆయుధంగా చేసుకొని అధికారపక్షాన్ని ఎప్పటికప్పుడు ఇరుకున పెడుతున్నారని చెప్పాలి. ఇదంతా బాగుంది కానీ.. ఈ తీరు బాబు హయాంలో ఏమైందన్న ప్రశ్నకు పవన్ సమాధానం చెబితే బాగుంటుందమో?