Begin typing your search above and press return to search.

డ‌బ్బులిచ్చి జైలుకు వెళ్లినోళ్ల అనుభ‌వ‌మిది

By:  Tupaki Desk   |   6 Sep 2016 9:55 AM GMT
డ‌బ్బులిచ్చి జైలుకు వెళ్లినోళ్ల అనుభ‌వ‌మిది
X
డ‌బ్బులిచ్చి జైలుకు వెళ్లకుండా చూసుకుంటారు కానీ.. డ‌బ్బులిచ్చి మ‌రీ జైలుకు వెళ్లేవారు అస్స‌లు ఉంటారా? అన్న సందేహం అక్క‌ర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో జైళ్ల‌శాఖ చేప‌ట్టిన జైలు ప‌ర్యాట‌కంతో ఇలాంటి చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్ర‌క సంగారెడ్డి జైలును ఈ మ‌ధ్య‌న ప‌ర్యాట‌కంగా మార్చ‌టం.. రూ.500 చెల్లించిన వారిని ఒక‌రోజు జైలు జీవితం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా జైలు ప‌ర్య‌ట‌కానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయి జైలు అనుభ‌వాన్ని చూసొచ్చారు శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి.

డ‌బ్బులిచ్చి మ‌రీ జైలుకెళ్లిన ఇత‌గాడి వ్య‌వ‌హారాన్ని జాతీయ మీడియా సైతం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి వార్త‌లు అచ్చేసింది. దాదాపు 220 ఏళ్ల నాటి చారిత్ర‌క జైలును జైలు ప‌ర్యాట‌కంగా మార్చిన నేప‌థ్యంలో ఆయ‌న జైలు అనుభ‌వం ఇప్పుడు వార్తాంశంగా మారింది. డ‌బ్బులిచ్చి మ‌రీ జైలుకు వ‌చ్చే అతిధుల ప‌ట్ల జైలు అధికారులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యాన్ని చూస్తే.. నిజంగానే జైలు అంటే ఏమిటో రుచి చూపించి మ‌రీ పంపిస్తార‌నే చెప్పాలి.
దేశంలోనే తొలిసారి తెర తీసిన ఈ జైలు ప‌ర్యాట‌కంలో డ‌బ్బులు చెల్లించి జైలుకు వెళ్లేందుకు సిద్ధ‌మైన వెంట‌నే.. అధికారులు అప్ప‌టివ‌ర‌కూ స‌ద‌రు వ్య‌క్తికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని త‌మ చేతుల్లోకి తీసేసుకుంటూ జైలు గోడ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లిపోతారు. వెంట‌నే ప‌ర్యాట‌కుడి బ‌ట్ట‌ల‌తో పాటు.. అత‌ని వ‌ద్ద ఉన్న ప‌ర్సు.. మొబైల్‌ ఫోన్‌.. న‌గ‌లు అన్నింటిని జైలు అధికారులు స్వాధీనం చేసుకుంటారు. అనంత‌రం జైలు గ‌దిలో ఉంచుతారు. జైలు మాన్యువ‌ల్ లో మాదిరి తెల్ల‌టి ముత‌క వ‌స్త్రాల్ని ఇస్తారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖైదీకి ఎలాంటి ఆహారాన్ని ఇస్తారో.. స‌ద‌రు ప‌ర్యాట‌కుడికి సైతం అదే ఆహారాన్ని అందిస్తారు.

అన్నం.. ర‌సం.. నీళ్ల ప‌ప్పు.. పెరుగుతో భోజ‌నం పెట్టారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల వేళ టీ ఇచ్చి.. రాత్రికి మ‌ళ్లీ భోజ‌నం పెట్టారు. ఇక‌.. రూల్స్ కు తగ్గ‌ట్లే ఖైదీల‌తో చేయించే గార్డెనింగ్ లాంటి ప‌నుల్ని చేయించారు. సాయంత్రం ఐదు గంట‌ల వేళ యోగా చేయించిన అధికారులు.. రాత్రి వేళ త్వ‌ర‌గా భోజ‌నం పెట్టేసి జైలు గ‌దిలోకి పంపేశారు. అస‌లు క‌ష్టం అప్ప‌టినుంచే మొద‌లైంద‌ట‌. సుదీర్ఘంగా సాగే రాత్రి సాగ‌టం.. మ‌రోవైపు దోమ‌ల‌తో మ‌హా ఇబ్బందిగా మారింద‌ట‌. తెల్లారిన త‌ర్వాత జైలు జీవితం మొద‌ల‌య్యాక‌.. జీవితంలో మ‌రోసారి జైలుముఖం చూడ‌కూడ‌ద‌ని డిసైడ్ అయి మ‌రీ ఇంటిముఖం ప‌డ‌తార‌ట‌.