Begin typing your search above and press return to search.

ఇప్పుడు కేసీఆర్ సారీ చెబుతారా జానాసాబ్?

By:  Tupaki Desk   |   5 Sep 2015 7:23 AM GMT
ఇప్పుడు కేసీఆర్ సారీ చెబుతారా జానాసాబ్?
X
నియమాలు ఉండటం మంచిదే. కానీ.. సమకాలీన పరిస్థితుల్ని అర్థం చేసుకోవటంతో పాటు.. ఎదుటోడి రాజకీయ వ్యూహాల్ని చూసి.. అందుకు తగ్గట్లుగా వ్యవహరించటం మేలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అధికారాన్ని చేతబట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతల దూకుడు రాజకీయాల గురించి అవగాహన ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించేవారు.

నిండు అసెంబ్లీలో తన సొంత శాసనసభ్యుడి చేత సారీ చెప్పించారు. నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సారీ చెప్పేంత తప్పుడు పని చేశారా? అంటే అదీ లేదు. పెద్దమనిషిగా వ్యవహరిస్తూ.. ఆ పెద్దమనిషి పోస్ట్ కు న్యాయం చేయాలన్న అత్యుత్సాహంతో ప్రత్యర్థులకు క్షమాపణలు చెప్పించటం సొంత పార్టీ వారిని విపరీతమైన వేదనకు గురి చేసింది. అయినా.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోన మండిపడిన విషయం తెలిసిందే.

జానాసాబ్ వైఖరిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఆయనకు కోపం వచ్చేసింది. తాను ఇప్పటి రాజకీయాలకు పనికిరానని.. తాను సీఎల్పీ నేతగా ఉండనంటూ బిగుసుకుపోయారు. జానాలాంటి నేతకు కోపం తెప్పించలేక.. అలా అని అధికారపక్షాన్ని సమర్థంగా ఎదుర్కునేందుకు దన్నుగా నిలిచే నాయకత్వం లేక.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

తెలంగాణలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్న ఏకైక పార్టీగా అంచనాలున్న కాంగ్రెస్ పార్టీని సమర్థంగా నడిపించే నాయకత్వ లేమి వెంటాడుతోంది. ఇదిలా ఉంటే.. జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు.. తమవైన రాజకీయాలు నడిపించటం ఇబ్బందికరంగా మారింది. చేయని తప్పునకు నాడు అసెంబ్లీలో సారీ చెప్పించిన జానా.. ఈ రోజు అందరి ఎదుట.. బహిరంగంగా జరిగిన సభలో తమ ఎమ్మెల్యేను అధికారపక్ష ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టటాన్ని ఎలా స్పందించారు. తన పెద్దమనిషి ట్యాగ్ తో.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పి.. ఆయన ఎమ్మెల్యే చేత బహిరంగంగా క్షమాపణ చెప్పించగలరా? చెంపలు వేసుకొని తప్పు అయిపోయిందన్న మాట అనిపించగలరా? అన్నది ప్రశ్నలు.

నిజానికి ఈ ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు లోగుట్టుగా ప్రశ్నిస్తున్నారు. అధికారపక్షం నేతలు ఏం చేసినా నడిచిపోతుందన్నట్లుగా అలుసు ఇచ్చిన దానికి ఫలితమే తాజా దాడి అంటూ మండిపడుతున్నారు. ఒక ఎమ్మెల్యేని.. మరో ఎమ్మెల్యే చేయి చేసుకోవటం ఏమిటి? ఇదేం కల్చర్ అని వారు మండిపడుతున్నారు? రాజకీయ విభేదాలు ఉంటే మాత్రం ఇలా చేతులకు పని చెబుతారా? అని నిలదీస్తున్నారు.

తమ పార్టీ నేతకు జరిగిన చేదు అనుభవంపై జానా తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఎంత మండిపడితే ఏం లాభం.. తనను పెద్దమనిషిగా.. గౌరవించినట్లు మాట్లాడే ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడి.. దుందుడుకుగా వ్యవహరించిన అధికారపక్ష ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని ఆయన చేత ఖండించేలా చేసి.. క్షమాపణలు చెప్పిస్తేనే జానారెడ్డి పెద్దరికమని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. జానారెడ్డి ఏం చేస్తారో చూడాలి.