Begin typing your search above and press return to search.

కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా ?

By:  Tupaki Desk   |   19 May 2022 6:03 AM GMT
కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా ?
X
మనదేశంలో కేవలం 2019 సంవత్సరంలో మాత్రమే కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా ? అక్షరాల 23 లక్షలమంది. వినటానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇదే వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా వివిధ కాలుష్యాల వల్ల ఏ దేశంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై అధ్యయనం చేసి ది లాన్సెట్ అనే జర్నల్ ఒక నివేదికను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 23 లక్షలమంది వివిధ రకాల కాలుష్యాల వల్ల చనిపోయారు.

చనిపోయిన మొత్తంలో కూడా 16 లక్షలమంది వాయుకాలుష్యం వల్లే చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల చనిపోయిన వారిసంఖ్య 90 లక్షలకు పైగానే. అంటే కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో సుమారు ఎంతమంది చనిపోయారో కాలుష్యం వల్ల కూడా దాదాపు అంతేమంది చనిపోవటం గమనార్హం. పైగా తాజా నివేదికలోని అంశాలు 2019కి సంబంధించినవి. అంటే బహుశా అప్పటికి ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం మొదలైనట్లులేదు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే చనిపోవటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ప్రపంచంలో కేవలం వాయుకాలుష్యం కారణంగా మాత్రమే 66 లక్షలమంది చనిపోయారు.

నీటికాలుష్యం వల్ల 16 లక్షలు, సీసం (లెడ్) కలిసిపోవటం వల్ల 9 లక్షలు, ఇతర విషపూరిత వాయువుల కారణంగా మరో 8.7 లక్షలమంది చనిపోయారు. మనదేశంలో అయితే వాయుకాలుష్యం కారణంగా చనిపోయిన వారిసంఖ్య సుమారుగా 10 లక్షలు.

మనదేశంలో కాలుష్య మరణాలు ఎక్కువగా ఉత్తరాధిలోనే ఎక్కువగా నమోదయ్యాయి. విద్యుత్ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు, వ్యవసాయాధార పరిశ్రమలు ఎక్కువున్న కారణంగా ఉత్తరాధిలో లక్షలమంది అనేక తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు.

ఇళ్ళల్లో ప్రధానంగా గ్రామాల్లో చెక్కలతో వంటలు చేయటం వల్ల వెలువడుతున్న పొగే వాయుకాలుష్యానికి ముఖ్య కారణమవుతోందని నివేదిక చెప్పింది. తక్కువ, మధ్య ఆదాయాలున్న కుటుంబాలపై కాలుష్య మరణాల ప్రభావం ఎక్కువగా ఉందట. కాలుష్య నివారణపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టకపోతే ముందు ముందు మరింత కష్టమైపోతోందని నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.