Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల్లో ఇంత మంది నేర చరితులా ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 1:30 PM GMT
యూపీ ఎన్నికల్లో ఇంత మంది నేర చరితులా ?
X
చట్టసభలకు నేరచరితులను దూరంగా ఉంచే విషయంలో రాజకీయ పార్టీల్లోని చిత్తశుద్ధి ఏమిటో బయటపడింది. ఈనెల 10వ తేదీన జరగబోయే ఉత్తరప్రదేశ్ మొదటి విడత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కొందరి చరిత్రను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వివిధ పార్టీల తరపున 615 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 156 మందిపైన అత్యంత తీవ్రమైన నేరాభియోగాలున్నాయంటూ విస్తు పోవాల్సిందే.

నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 156 మందిలో కూడా 125 మంది మీద అత్యాచారం, కిడ్నాప్, హత్యలు, హత్యాచారాల కేసులు నమోదై ఉన్నాయి. ఈ నివేదికలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. 615 మంది దాఖలుచేసిన అఫిడవిట్లను ఏడీఆర్ సంస్థ పరిశీలిస్తే అందులో 8 మంది అఫిడవిట్లు ప్రింటింగ్ సరిగా లేని కారణంగా పరిశీలన సాధ్యం కాలేదని చెప్పింది.

ఈ నివేదిక ప్రకారమైతే పోటీ చేస్తున్న నేర చరితుల్లో ఎస్పీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ చివరకు ఆప్ తరపున కూడా ఉండడం విచిత్రం. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్ధులుగా 15-75 శాతం మందికి నేర చరితులకే టికెట్లిచ్చాయి. పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళంతట వాళ్ళుగానే తమ అఫిడవిట్లలో తమపైన నమోదైన కేసుల వివరాలు చెప్పారు. అత్యాచారం, అత్యాచారం, కిడ్నాపులు, హత్యల కేసుల్లో ఉండటమంటే మామూలు విషయం కాదు.

సమాజంలో స్వేచ్చగా, ఆకాశమే హద్దుగా నేరాలకు పాల్పడుతున్న వారే చట్టసభల్లోకి వచ్చిచట్టాలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. నేరచరిత్ర ఉన్నవారు సభల్లో చేసే చట్టాలు ఎవరికి చుట్టాలుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా నేర చరితులకు టికెట్లివ్వటంలో ప్రముఖ పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు బయటపడిన అభ్యర్థుల నేర చరిత మొదటి దశ ఎన్నికలకు సంబంధించి మాత్రమే.

యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మిగిలిన దశల అభ్యర్థుల జాబితాలు కూడా బయటకు వస్తే వాళ్ళ చరిత్ర కూడా జనాలకు తెలుస్తుంది. అయినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారంతా ఏదో ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే అయితే జనాలు మాత్రం ఏమి చేస్తారు ? ఎవరో ఒకరికి ఓటేయక తప్పదు కదా. ఎంతమంది ఓటర్లు నోటాకు ఓట్లేస్తారు ?