Begin typing your search above and press return to search.

ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి ?

By:  Tupaki Desk   |   19 Sep 2022 4:30 AM GMT
ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జోస్యాలు చెప్పటం అలవాటైనట్లుంది. కాకపోతే ఆ జోస్యమంతా జగన్మోహన్ రెడ్డి మీదే తప్ప ఇంకోరి మీదుండదు. చివరకు సొంతపార్టీ విషయంలో కూడా జోస్యాలు చెప్పినట్లు ఎవరూ చూడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుండి 67 సీట్లకన్నా రాదని బల్లగుద్ది మరీ చెప్పారు. పవన్ తాజా లెక్కలకు హేతువు ఏమిటో ఎవరికీ తెలీదు. ఒకసారి నిపుణులు చెప్పారని మరోసారి సర్వేలో తేలిందని చెప్పారు.

ఇదే పవన్ కల్యాణ్ రెండునెలల క్రితం మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లకు మించి రావని గట్టిగా చెప్పారు. రెండునెలల వ్యవధిలోనే అదీ పవన్ మాటల్లోనే వైసీపీకి 15 నుండి 67 సీట్లకు పెరిగిందంటే మంచి పెరుగుదలనే చెప్పాలి.

అయితే వైసీపీ గెలుచుకోబోయే సీట్లేమిటో మాత్రం పవన్ చెప్పలేదు. వైసీపీకి 67 సీట్లు వస్తాయని సర్వేలో బయటపడినప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఎన్నిసీట్లు వస్తాయో కూడా తెలిసే వుండాలి కదా.

ఎందుకంటే కేవలం వైసీపీ గెలుచుకోబోయే సీట్లమీద మాత్రమే పవన్ సర్వే చేయించరుకదా. అధికారపార్టీతో పాటు ఇతర పార్టీలు అందులోను సొంతంపార్టీ జనసేన గెలుచుకోబోయే సీట్ల విషయంలో కూడా కచ్చితంగా సర్వే చేయించే ఉంటారు. వైసీపీ గెలుచుకోబోయే సీట్ల ఎన్నో చెప్పినపుడు తన పార్టీకి ఎన్నిసీట్లు వస్తుందో ఎందుకు చెప్పలేదు ?

జనసేన పొత్తులో పోటీచేస్తోందా లేక ఒంటరిగా పోటీచేస్తుందా అన్నది వేరే విషయం. బీజేపీతో మిత్రపక్షం కాబట్టి రెండుపార్టీలకు కలిపి వచ్చే సీట్లు లేదా ఒంటరిగా పోటీచేస్తే గెలుచుకోబోయే సీట్లపై సర్వే చేయించి ఉంటారనటంలో సందేహంలేదు.

ఈ లెక్కలన్నీ చెప్పకుండా సింపుల్ గా జనసేన బలపడుతోందని మాత్రమే చెప్పి వదిలేశారు. అంటే చేయించుకున్న సర్వేలో జనసేన గెలుచుకోబోయే సీట్ల సంఖ్య అంత ఆశాజనకంగా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.