Begin typing your search above and press return to search.

దేవుడా... తెలుగురాష్ట్రాల్లో ఇన్ని షెల్ కంపెనీలా?

By:  Tupaki Desk   |   28 July 2021 5:36 AM GMT
దేవుడా... తెలుగురాష్ట్రాల్లో ఇన్ని షెల్ కంపెనీలా?
X
నల్లధనాన్ని, హవాల నిధులను విచ్చల విడిగా దారులు మళ్ళించటానికి షెల్ కంపెనీలకు మించిన మార్గంలేదు. దేశంలో షెల్ కంపెనీలు పెరిగిపోతున్నాయంటే బ్లాక్ మనీ కూడా అంతలా పెరిగిపోతున్నదనే అర్ధం. ఈ షెల్ కంపెనీల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవు. దీనికి ప్రత్యేకంగా ఆస్తులంటూ కూడా ఏమీ ఉండవు. కేవలం పన్ను ఎగవేత, మనీల్యాండరింగ్ కోసం, యాజమాన్యం ఎవరో తెలీకుండా ఉండటం కోసమే ఇలాంటి షెల్ కంపెలను చాలామంది పారిశ్రామికవేత్తలు తెరుస్తుంటారు.

ఇలాంటి షెల్ కంపెనీలు దేశం మొత్తంమీద 2.38 లక్షలున్నాయి. వీటిల్లో తెలుగురాష్ట్రాల్లో సుమారు 25 వేలున్నాయని బయటపడింది. హైదరాబాద్ లో 20,498 కంపెనీలుండగా, విజయవాడలో 4918 ఉన్నాయి. వీటన్నింటినీ మూసేయించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి రావు ఇందర్ జిగ్ సింగ్ చెప్పారు. దేశంలో అత్యధికంగా ముంబాయ్ లో 52,869 కంపెనీలుంటే ఢిల్లీలో 45,595 కంపెనీలున్నాయి.

పారిశ్రామికవేత్తలు+రాజకీయ నేతలు కలగలసిపోయిన ఇప్పటి రాజకీయాల్లో ఎన్ని కంపెనీలు పారిశ్రామికవేత్తలవి, ఎన్ని రాజకీయనేతలవనే విషయం తేల్చిచెప్పటం కష్టమే. తెలుగురాష్ట్రాలనే ఉదాహరణలుగా తీసుకుంటే ఎంపిలు రేవంత్ రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్, అయోధ్య రామిరెడ్డి, నామా నాగేశ్వరరావు, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు లాంటి అనేకమందిపై షెల్ కంపెనీలు పెట్టినట్లు ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే.

పై నేతలంతా ఇటు వ్యాపారాల్లోను అటు రాజకీయాల్లోను చాలా యాక్టివ్ గా ఉన్నారు. తమ సంపాదనలో లెక్కలో చూపని బ్లాక్ మనీని దాచుకోవటానికే చాలామంది షెల్ కంపెనీలను కొంటున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. మొత్తంమీద వ్యాపారస్తులను, రాజకీయ నేతల మధ్య చెరిగిపోయిన సరిహద్దు పుణ్యమాని దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతోందని ఆర్ధిక శాస్త్రవేత్తలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. తాజాగా మంత్రి ప్రకటనతో దేశంలో పట్టుబడిన షెల్ కంపెనీలు ఎన్ని లక్షల్లో ఉన్నాయో అర్ధమైపోతోంది.