Begin typing your search above and press return to search.

న్యాయవాదుల హత్య కేసులో మలుపులు ఎన్నో?

By:  Tupaki Desk   |   20 Feb 2021 7:30 AM GMT
న్యాయవాదుల హత్య కేసులో మలుపులు ఎన్నో?
X
తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాద దంపతుల కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది.

తొలుత పాతకక్షలతో కుంట శ్రీనివాస్ తోపాటు మరో ఇద్దరు న్యాయవాద దంపతులను చంపారని భావించారు. కానీ వీరికి సహాయ సహకారాలు అందించింది టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ అని పోలీసుల విచారణలో తేలినట్లు ప్రచారం సాగుతోంది. బిట్టు శ్రీనునే నిందితులకు కత్తులతోపాటు కారును ఇచ్చాడని పోలీసులు పేర్కొనడం అందరినీ షాక్ కు గురిచేసింది.

న్యాయవాది వామన్ రావు సొంత గ్రామం గుంజపడుగులో నెలకొన్న వివాదాల వల్లనే వసంతరావు ప్రోద్బలంతో కుంట శ్రీనివాస్, కుమార్ లు తమ కుమారుడు , కోడలును హత్య చేశారని వామన్ రావు తండ్రి కిషన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. హత్య టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగిందని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.

వామనరావు హత్య వెనుక టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ కు, ఆయన వెనుకున్న వాళ్లకు ప్రత్యక్ష సంబంధం ఉందని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపించడం సంచలనమైంది.

హైకోర్టు న్యాయవాదుల హత్య కేసులో నిందితులు వాడిన నంబరు లేని కారు బిట్టు శ్రీనుదని పోలీసులు తెలిపారు. కారుతోపాటు నిందితులకు కత్తులను, డ్రైవర్‌ను సమకూర్చింది కూడా అతడేనని తేల్చారు. ఈ బిట్టు శ్రీను మరెవరో కాదు.. జడ్పీ చైర్మన్‌ మేనల్లుడనని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం..దీంతో.. హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదుల హత్యపై మార్చి 1లోపు నివేదిక కోరింది. దీంతో పోలీసులు ఈ కేసులో ఎవరెవరి ప్రమేయంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ముగ్గురు నిందితులకు కరోనా టెస్టులు చేసి జడ్జీ ముందు హాజరు పరిచారు. కస్టడీకి తీసుకోనున్నారు.

వామన్‌రావు, నాగమణి హత్య వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంథని ప్రాంతంలో నాలుగైదేళ్లుగా పలు ఘటనలు, నేతల వ్యవహారాలపై కోర్టుల్లో వామన్ రావు కేసులు వేయడం వారి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిసింది.. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.