Begin typing your search above and press return to search.

కాలిఫోర్నియా కార్చిచ్చు ఎంత డేంజర్ అంటే?

By:  Tupaki Desk   |   2 Nov 2019 4:38 AM GMT
కాలిఫోర్నియా కార్చిచ్చు ఎంత డేంజర్ అంటే?
X
అత్యాధునిక సాంకేతికత అగ్రరాజ్యం సొంతం. అలాంటి అమెరికాకే సవాలుగా మారింది కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు. సాధారణంగా అగ్నిప్రమాదాన్ని అపటానికి గంటల సమయం తీసుకుంటుంది. అలాంటిది భారీ ఎత్తున కమ్మేస్తున్న కార్చిచ్చును కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇదే.. ఇప్పుడు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. రోజుల తరబడి అదే పనిగా విస్తరిస్తున్న కార్చిచ్చును కంట్రోలో చేయటం కోసం అగ్రరాజ్యం భారీగా శ్రమిస్తోన్నా ఫలితం రావటం లేదు.

ప్రపంచంలోని అడవుల్లో కాలిఫోర్నియా అడవులు చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లు ఉంటాయి. కొన్నివందల ఏళ్ల నాటి చెట్లను కూడా ఈ అడవుల్లో చూడొచ్చు. అందుకే కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు ఇప్పుడు అమెరికా అధికారుల గుండెల్ని దడదడలాడేలా చేస్తోంది. కార్చిచ్చు కారణంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయటం మామూలు విషయం కాదంటున్నారు.

గత నెల 23న (అక్టోబరు) రేగిన కార్చిచ్చును కంట్రోల్ చేయటానికి గడిచిన పదకొండు రోజులుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. మంటలు విస్తరించిన భాగంలో సగం మేర కంట్రోల్ చేసినట్లు చెప్పినా.. మిగిలిన సగం మాటేమిటి? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. ఈ కార్చిచ్చునేపథ్యంలో హాలీవుడ్ కు చెందిన పలువురిని వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించిన వైనం తెలిసిందే. వీరితో పాటు వేలాది మంది సామాన్యులు ఉన్నారు.

దాదాపు 500 పైగా ఫైరింజన్లతో కార్చిచ్చును ఆపేందుకు అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నా..వారికి సాధ్యం కావట్లేదు. చరిత్రలోనే అతి పెద్ద కార్చిచ్చుగా తాజా కాలిఫోర్నియా కార్చిచ్చును అభివర్ణిస్తున్నారు. చివరకు పరిస్థితి అంతకంతకూ దారుణంగా తయారుకావటంతో ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పుడు 40వేల ఎకరాల్లో చెలరేగుతున్న కార్చిచ్చు కారణంగా పెద్ద ఎత్తున మంటలు.. దట్టమైన పొగతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. 77 వేల ఎకరాలకు విస్తరించిన మంటల్ని సగం మేర ఆర్పగలిగారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల కారణంగా లక్షలాది చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

మంటలకు సంబంధించిన ఫోటోల్ని అంతరిక్షం నుంచి నాసా ఫోటోలు తీసి పంపుతోంది. మంటల్ని అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి ఎంతదారుణంగా ఉందంటే.. దాదాపు 30 లక్షలకు పైగా ప్రజలకు కరెంటు సౌకర్యం లేని పరిస్థితి. ఈ రాష్ట్రంలోనే గూగుల్.. మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా జరుగుతున్న నష్టం ఒక ఎత్తు అయితే.. ఇదే తీవ్రతతో కొనసాగితే.. జరిగే వినాశనాన్ని అంచనా వేయటం కష్టమని చెప్పక తప్పదు. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు.. దాని స్థాయికి తగ్గ కష్టం కాలిఫోర్నియా కార్చిచ్చుతో చోటు చేసుకుందని చెప్పక తప్పదు.