Begin typing your search above and press return to search.

పేటీఎం షేరు ఎంత పని చేసింది? సెబీ ఏం చేస్తోంది?

By:  Tupaki Desk   |   12 March 2022 4:48 AM GMT
పేటీఎం షేరు ఎంత పని చేసింది? సెబీ ఏం చేస్తోంది?
X
ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టటం ఎక్కువైంది. కరోనా పుణ్యమా అని.. వర్కు ఫ్రం హోం రావటం.. తాము చేస్తున్న ఉద్యోగానికి అదనంగా మరేదైనా చేయాలన్న తపన ఈ మధ్యన ఎక్కువైంది. ఉద్యోగంతో వచ్చే జీతం డబ్బులకు అదనంగా తమ తెలివితో సంపాదించే అంశాల మీద ఫోకస్ చేయాలన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. ఆఫీసులో ఉండి ఉద్యోగం చేసే వేళలో.. ఇలాంటి ఆలోచనలకు అవకాశం ఉండేది కాదు. కానీ.. ఇంట్లో ఉండటం.. రోజంతా పని.. ఇంట్లోని వారు తప్పించి మరో వ్యాపకం లేకపోవటంతో.. డబ్బులు సంపాదించే మార్గాలు చుట్టూ ఉన్నాయన్న విషయాన్ని గుర్తించిన కొందరు తాము ఉన్న ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ లో.. మరికొందరు స్టాక్ మార్కెట్లో.. ఇంకొందరు మరిన్ని కొత్త అవకాశాలను వెతుకుతున్నారు.

ఈ తీరుతో గడిచిన రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో.. పలు కంపెనీలు ఐపీవో పేరుతో మార్కెట్లోకి వచ్చి భారీగా నిధులు సమీకరణ చేస్తున్నాయి. సాధారణంగా ఐపీవోలకు వచ్చిన కంపెనీల విలువను భారీగా పెంచేసి చూపిస్తుంటే.. మార్కెట్లో దానికుండే ఇమేజ్ ఆధారంగా శాస్త్రీయ లెక్కల్ని పక్కన పెట్టేసి.. కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో చాలామంది నష్టపోతున్నారు.

దీనికి క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా పేటీఎం ఐపీవోను చెప్పొచ్చు. గత నవంబరులో పేటీఎం సంస్థ ఐపీవోకు రావటం.. దాని షేరు ఇష్యూ ధరను రూ.2150గా నిర్ణయించారు. అయినప్పటికీ భారీ స్పందనతో ఏకంగా రూ.18300 కోట్ల భారీ మొత్తం ప్రజలు పేటీఎంలో పెట్టుబడుల రూపంలో పెట్టారు. అయితే.. ఆ షేరు తర్వాత మార్కెట్ లో చతికిల పడి.. ప్రస్తుతం రూ.776 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో.. సొమ్ములు పెట్టినోళ్లంతా భారీగా నష్టపోయిన పరిస్థితి.

కంపెనీ పద్దు పుస్తకాల్ని చూసినప్పుడు నష్టాలు నమోదు చేస్తున్నకంపెనీలు.. భారీ విలువతో పబ్లిక్ ఇష్యూలకు ఎలా వెళతాయి? అన్న లాజిక్ ప్రశ్న ఒకటి చాలామందికి తట్టినా.. దానికి సమాధానం రాని పరిస్థితి. ఇదే విషయాన్ని సెబీ ముందుకు పలువురు తీసుకెళ్లారు. దీనిపై తాజాగా సెబీ స్పందించింది. పేటీఎం ఎపిసోడ్ తో తమకు ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఐపీవోలకు వచ్చిన సందర్భంలో గతానికి భిన్నంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు.

దీర్ఘకాలం నష్టాల్ని నమోదు చేస్తున్న కొత్త తరం కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినప్పుడు.. వారు వెల్లడించే సంప్రదాయ ఆర్థిక విధనాలు.. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటంలో ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టే వారికి సరైన రీతిలో సాయం చేయటం లేదని గుర్తించినట్లుగా సెబీ చెబుతోంది. అందుకే.. ఇకపై ఇప్పుడు ఇస్తున్న వివరాలతో పాటు అదనంగా మరిన్ని వివరాలు ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. ఈ కొత్త తనిఖీలతో మదుపరులు నష్టపోకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. సెబీ అడిగిన అదనపు సమాచారాన్ని మదుపరులకు టెక్ కంపెనీలు ఇస్తాయా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. సెబీ నిర్ణయాన్ని పలు టెక్ కంపెనీలు తప్పు పడుతున్నాయి.

ఇలాంటి తీరును సెబీ అనుసరిస్తే.. స్టార్టప్ లు దేశంలో కాకుండా బయట దేశాల్లో లిస్ట్ కావటానికి ఆసక్తి చూపుతాయని చెబుతున్నారు. ఈ బెదిరింపులకు సెబీ అస్సలు భయపడటం లేదు. లక్షలాది మంది మదుపర్లను నష్టపరిచే ఏ చిన్న అవకాశాన్ని తాము ఇవ్వాలని కోరుకోవటం లేదని.. అందుకే ఇప్పుడు అడుగుతున్న వివరాలకు అదనంగా మరిన్ని వివరాలు ఇవ్వాలని అడుగుతున్నామని సెబీ స్పష్టం చేస్తోంది.