Begin typing your search above and press return to search.

జనసేన గ్రాఫ్ ఎంత పెరిగిందంటే....?

By:  Tupaki Desk   |   22 Jan 2023 12:30 AM GMT
జనసేన గ్రాఫ్ ఎంత పెరిగిందంటే....?
X
ఏపీలో జనసేన ఒక పొలిటికల్ ఫోర్స్ గా మారుతోంది. ఆ పార్టీ కెపాసిటీ ఏంటి అన్నది 2019లో కొంత మేర తెలిసింది. నాడు ఓట్లు చీల్చిన పార్టీగా జనసేన నిలిచింది. అలా తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బేసింది. వందకు పైగా మాత్రమే సీట్లు రావాల్సిన వైసీపీ ఖాతాలో 151 సీట్లు వచ్చి చేరాయంటే ఈ చీలిక ప్రభావం చాలానే ఉంది అని అంటారు.

ఆ చీలికకు భయపడే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులకు సిద్ధపడుతోంది. ఇదిలా ఉంటే ఈ రోజుకు జనసేన గ్రాఫ్ ఏపీలో పెరిగింది అని అంటున్నారు. ఇంతకీ జనసేన గ్రాఫ్ ఎంత వరకూ పెరిగింది అంటే అది జనసేనలో మరో కీలక నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు మాటలలో చెప్పాలీ అంటే ఏకంగా 24 శాతానికి పైరిగిందట.

అంటే 2019 ఎన్నికల్లో కేవలం ఏడు శాతానికి మాత్రమే పరిమితం అయిన జనసేన బలం ఇపుడు మూడు రెట్లు పెరిగింది అని నాగబాబు చెబుతున్నారు. ఇక ఎన్నికల వేళకు తమ బలం కాస్తా 40 శాతానికి పైగా పెరిగినా ఆశ్చర్యం లేదు అని ఆయన అంటున్నారు. ఏపీలో 2019లో వైసీపీకి యాభై శాతం ఓట్ల షేర్ వస్తే తెలుగుదేశానికి 40 శాతం ఓట్ల షేర్ వచ్చింది. మరి ఇపుడు ఒక్క జనసేనకే 40 శాతం ఓట్ల షేర్ వస్తే మిగిలిన రెండు బలమైన పార్టీల పరిస్థితి ఏంటి అన్నది చూడాలని అంటున్నారు.

మరి అంతలా జనసేన బలం పెరిగిందా అన్న చర్చ కూడా మరో వైపు నడుస్తోంది. నిజానికి చూస్తే జనసేన పెరిగిన గ్రాఫ్ కూడా కొన్ని జిల్లాలకే పరిమితం అని అంటున్న వారు ఉన్నారు.

గోదావరి జిల్లాలో అయితే పాతిక శాతంగా కొన్ని నియోజకవర్గాలలో జనసేన ఓట్ల షేర్ ఉంటే ఉండొచ్చు అని అంటున్నారు. అయితే టోటల్ గా 175 నియోజకవర్గాలలో ఆ పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోందా అన్నదే చూడాల్సి ఉంది.

మరి క్యాడర్ ని ఉత్సాహపరచేందుకు నాగబాబు ఈ మాటలు అన్నారా లేక నిజంగా వారు ఏమైనా సొంత సర్వే లాంటిది చేయించుకుని ఈ రకంగా చెబుతున్నారా అన్నది తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి. అది రాజకీయ సహజ సూత్రాలకు కట్టుబడి చూసుకుంటే కనుక రెండు బలమైన పార్టీల మధ్య మూడవ ఫోర్స్ రంగంలోకి వచ్చి ఎంత బలంగా ఢీ కొట్టినా దానికి టోటల్ బలం ఎపుడూ మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్ల షేర్ లో సగానికి మించదు. ఎపుడైనా అలా జరిగితే ప్రధాన పార్టీలు రెండు డిజాస్టర్లుగా నిలిస్తేనే సాధ్యపడుతుంది.

కానీ ఏపీలో ఈ రోజుకీ చూస్తే వైసీపీలో గెలుపు ధీమా సడలలేదు. అలాగే తెలుగుదేశంలో అధికార ఆశలు రెట్టింపు అవుతున్నాయి. అందువల్ల జనసేన బలం 40 శాతానికి పెరుగుతుంది అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇక ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా చేస్తామని నాగబాబు అంటున్నారు. పవన్ని సీఎం చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనలో డెసిషన్ మేకర్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాబట్టి పొత్తుల ఎత్తుల మీద రణస్థలంలో ఆయన మట్లాడిన మాటలే ఫైనల్ అనుకోవాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.