Begin typing your search above and press return to search.

తీపి.. చేదులను కలుపుతూ కేసీఆర్ కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   17 July 2021 3:57 AM GMT
తీపి.. చేదులను కలుపుతూ కేసీఆర్ కీలక నిర్ణయం!
X
అంచనాలు నిజమయ్యాయి. మొన్నటివరకు జరుగుతుందని చెప్పిన కసరత్తు తాజాగా పూర్తి కావటమే కాదు.. క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా ప్రకటన విడుదల కావటమే మిగిలింది. అవును.. తెలంగాణలో ఏకకాలంలో రెండు కీలక అంశాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడి కానుంది.

గడిచిన కొంతకాలంగా తెలంగాణలో పెంచని భూముల విలువను పెంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా కాకున్నా.. కొంతమేర భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పెంపు 50 శాతం మేరకు పెంచేయటం విశేషం. అధికారిక వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల విలువ మాత్రమే కాదు.. ఇళ్లు.. అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర ఆస్తుల విలువ బాగా తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు పెంచేస్తే.. ఇంకొన్ని చోట్ల మూడు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

వ్యవసాయేతర భూములు.. ఇళ్ల విలువ 25 శాతం నుంచి 50 శాతం మేరకు పెంచితే..అపార్ట్ మెంట్లలో ప్లాట్ల విలువను ప్రాంతాల వారీగా 20 నుంచి 50 శాతం మేర పెంచటం గమనార్హం. కొన్నిచోట్ల ఇది 80 శాతం మేర వరకు పెంచినట్లుగా సమాచారం.

ఓవైపు ఆస్తుల విలువను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ల ఫీజును ఒక శాతం అదనంగా పెంచేయనున్నారు. అంటే.. ఇప్పటివరకు ఉన్న ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కాస్తా ఏడు శాతంగా మారనుంది. ఈ రెండింటి వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమిటంటే.. ఆస్తుల విలువ ప్రభుత్వమే పెంచేయటం వల్ల.. మార్కెట్ వాల్యూ కూడా అంతో ఇంతో పెరుగుతుంది. దీంతో.. వ్యక్తిగత ఆస్తుల పెంపునకు వీలవుతుంది.

అదే సమయంలో.. పెరిగిన ఆస్తుల విలువకు తగ్గట్లు.. రిజిస్ట్రేషన్ ఖర్చు పెరుగుతుంది. అంతిమంగా ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయాన్ని పెంచేలా చేస్తుంది. ఉదాహరణకు ఇప్పటివరకు ఒక ప్రాంతంలో ఎకరం భూమి విలువ లక్ష రూపాయిలు అనుకుందాం. దాన్ని కాస్తా తాజా పెంపుదలతో రూ.2లక్షలు అయ్యిందనుకుందాం. ఇక్కడ ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం.. సదరు భూమి హక్కుదారుకు ఒరిగేదేమిటన్నది ఆసక్తికరం.

మొదటగా సదరు భూమి హక్కుదారుకు కలిగే ప్రయోజనం ఏమిటో చూద్దాం. సాధారణంగా.. మార్కెట్ విలువకు ప్రభుత్వ విలువకు మధ్య అంతరం ఉంటుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒకచోట ఎకరం భూమి రూ.లక్ష అని చెప్పినా.. మార్కెట్లో దాని విలువ రూ.5లక్షల వరకు ఉండొచ్చు. ప్రభుత్వం పేర్కొన్న లక్ష రూపాయిలకే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. అంటే..భూమి హక్కుదారు ఎవరికైనా తన ఎకరం భూమిని అమ్మినప్పుడు అధికారికంగా లక్ష రూపాయిలకు అమ్మినట్లు చూపిస్తారు కానీ.. అతడి చేతికి వచ్చేది రూ.5 లక్షలు. తాజాగా చేసే మార్పు కారణంగా ప్రభుత్వమే రూ.2 లక్షలు చేసిందనుకుందాం. మార్కెట్ విలువ రూ.5 లక్షలే ఉంటుంది. కాకుంటే.. సదరు భూమిని ఎవరికైనా అమ్మాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో మాదిరి రూ.లక్ష కు కాకుండా రూ.2లక్షలకు చేయించాల్సి ఉంటుంది. దీంతో.. రిజిస్ట్రేషన్ ఆదాయం రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది.

అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 6 శాతం నుంచి 7 శాతానికి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఒకేసారి ఆస్తుల విలువను.. రిజిస్ట్రేషన్ ఫీజును పెంచటం వల్ల.. ఆస్తుల్ని కొనుగోలు చేసే వారి మీద అదనపు భారం పడుతుంది. ఇది ఇబ్బందికరమని చెప్పాలి.

సాధారణంగా ఆస్తుల ప్రభుత్వ విలువను.. రిజిస్ట్రేషన్ విలువను ఒకేసారి పెంచేందుకు ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపదు. కానీ.. సీఎం కేసీఆర్ రూటు సపరేటు కావటంతో.. రెండింటిని ఒకేసారి పెంచేసేందుకు ఓకే చేసేశారు. పెద్ద సారు ఎప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటే.. అందుకు ఓకే అనేలా ప్రజలు రెఢీగా ఉండాలి కాబట్టి.. అంతకు మించి చేయగలిగిందేమీ లేదు. ఆస్తుల విలువ పెంపు.. వాటి హక్కుదారుకు తీపివార్తగా మారితే.. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు మాత్రం చేదువార్తగా చెప్పక తప్పదు. ఒకచేత్తో తీపి.. మరో చేత్తో చేదును ఇచ్చేసేందుకు రంగం సిద్ధం చేసిన కేసీఆర్ తీరుపై ప్రజల రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందో కాలమే సమాధానం చెప్పగలదు.