Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కు మోడీ ఇచ్చిన టైం ఎంత? 50 నిమిషాలు నిజం కాదా?

By:  Tupaki Desk   |   6 Sep 2021 4:07 AM GMT
సీఎం కేసీఆర్ కు మోడీ ఇచ్చిన టైం ఎంత? 50 నిమిషాలు నిజం కాదా?
X
రోటీన్ కు భిన్నమైన పరిణామాలకు వేదికగా నిలిచింది గత వారం. అనుకోని పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రలో చార్మినార్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభ.. రాజకీయ వర్గాల్లో హాట్ చర్చగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన జరగటం.. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లటం.. అక్కడే మకాం పెట్టటం తెలిసిందే.

గతానికి భిన్నంగా ఈసారి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకొన్న తర్వాత రాష్ట్రానికి తిరిగిరావాలన్న పట్టుదలను ప్రదర్శించటం.. అందుకు తగ్గట్లే రోజు గడిచేసరికి ప్రధాని మోడీతో అపాయింట్ మెంట్ ఖరారు కావటం తెలిసిందే. చాలామంది ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ అయితే అరగంట లోపు.. లేదంటే 45 నిమిషాల కంటేతక్కువ సమయంలోనే తన భేటీని ముగిస్తారు. అందుకు భిన్నంగా కేసీఆర్ టీం మాత్రం.. ప్రధానితో సీఎం కేసీఆర్ 50 నిమిషాల పాటు మాట్లాడారంటూ ‘భేటీ’ గురించి గొప్పగా చెప్పుకుంటూవార్తలు వచ్చాయి.

ఓపక్క తెలంగాణలో తమ పార్టీ నేతలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహా సంగ్రామ యాత్ర జరుగుతున్న వేళలో.. ప్రధాని మోడీ ఏకంగా యాభై నిమిషాల పాటు టైం ఇవ్వటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమైంది. తనను కలవటానికి వచ్చే విపక్ష నేతల్ని కలిసేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తి ప్రదర్శించకపోవటమే కాదు.. అపాయింట్ మెంట్ కోసం అదే పనిగా తిప్పుతారన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి కేసీఆర్ కోరినంతనే ప్రధాని మోడీ టైం ఇచ్చేయటం.. వారి మధ్యన సాగిన భేటీ చాలా బాగా జరిగినట్లుగా చెప్పటం తెలిసిందే. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కోరగా.. తాను తప్పనిసరిగా వస్తానని ప్రధాని మోడీ చెప్పినట్లుగా కేసీఆర్ అండ్ కో ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ ఇచ్చిన అపాయింట్ మెంట్ టైంను కేసీఆర్ టీం తప్పుగా ప్రచారం చేస్తుందన్న విమర్శ తెర మీదకువచ్చింది. మిగిలిన వారు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యను చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి ఈ విమర్శ రావటం అండర్ లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి. తాను చేస్తున్న పాదయాత్రలో భాగంగా తాజగా మాట్లాడిన బండి సంజయ్.. మోడీ - కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాము చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని.. సొంత ఎమ్మెల్యేలు చేజారే ప్రమాదం ఉందనే భయంతో ప్రధానిని బతిమిలాడి అపాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ఢిల్లీకి పోయి వంగి.. వంగి దండాలు పెట్టారని.. ప్రధాని ఐదు నిమిషాల టైమిస్తే.. బయటకు వచ్చి 50 నిమిషాలు తనతో మాట్లాడినట్లుగా కేసీఆర్ గప్పాలు కొడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆయన్ను శభాష్ అన్నట్లు కోతలు కోస్తున్నారని.. ఏం చేశారని ప్రధాని శభాష్ అనాలని ప్రశ్నించారు.

ఒకవేళ.. బండి సంజయ్ మాటల్లోనిజమే ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన ఐదు నిమిషాల టైంను యాభైనిమిషాలుగా చెప్పుకోవటం.. ప్రచారం చేసుకోవటాన్ని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక వివరణగా విడుదల చేయొచ్చు. లేదంటే.. పార్టీ పరంగా పక్కరోజునే ఖండించొచ్చు. అలాంటిది చేయకుండా.. ఇలా మాట్లాడటం ఏమిటన్న మాట వినిపిస్తోంది? ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోడీ ఇచ్చిన సమయం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.