Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ తర్వాత ట్రైన్ జర్నీ ఎలానో తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   10 April 2020 6:15 AM GMT
లాక్ డౌన్ తర్వాత ట్రైన్ జర్నీ ఎలానో తెలిస్తే అవాక్కే
X
ప్రస్తుతం యావత్ దేశం లాక్ డౌన్ లో ఉంది. ఒక్కమాటతో లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చినా.. దాన్ని ఎత్తివేయటం.. తదనంతర పరిణామాలు చాలానే ఉండనున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు? లాక్ డౌన్ తర్వాత ట్రైన్లో జర్నీ చేయాలంటే ఎన్ని అంశాలు ఉంటాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. లాక్ డౌన్ తర్వాత క్రమపద్దతిలో ట్రైన్లను నడపాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 15 నుంచి రైలు ప్రయాణాలకు అనుమతి ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. అన్ని రైళ్లు కాకుండా కొన్ని ప్రత్యేక సర్వీసుల్లో మాత్రమే రైళ్లను నడపనున్నారు. అదికూడా బోలెడన్ని నిబంధనల్ని పెడతారని చెబుతున్నారు. కరోనా నియంత్రణ చేపడుతూ.. పలు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాల్లో దింపేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. రైలు ప్రయాణానికి బోలెడన్ని నిబంధనలు ఉంటాయని చెబుతన్నారు.

అందులో మొదటిది.. ట్రైన్ లో స్లీపర్ కోచ్ లు ఉంటాయే కానీ.. ఏసీ బోగీలు ఉండవు. అంతేకాదు.. ఒకట్రెండు స్టాపులు మాత్రమే ఉంటాయే కానీ.. గతంలో మాదిరి అన్ని స్టేషన్లలో ఆపే అవకాశం ఇవ్వరు. అంటే.. ఇంచుమించు నాన్ స్టాప్ సర్వీసులన్న మాట. ప్రయాణానికి పన్నెండు గంటల ముందు ప్రయాణికుడు తన ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారాన్ని రైల్వే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. జర్నీ వేళలో ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే.. మధ్యలో ఏదైనా స్టేషన్లో దించేస్తారు. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు.

కోచ్ లోని క్యాబిన్ కు ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా బెర్తులు కేటాయిస్తారు. సైడ్ బెర్త్ లను ఖాళీగా వదిలేస్తారు. రైళ్లల్లో క్యాటరింగ్ సర్వీసులు ఉండవు. బెర్తు కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే జర్నీకి అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్లకు ప్రయాణం చేసే అవకాశం ఇవ్వరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రైలు ప్రయాణం అంటే.. ట్రైన్ బయలుదేరటానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో వెళ్లాలి. రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అదయ్యాక కోచ్ లోకి ఎక్కాల్సి ఉంటుంది. ఫ్లాట్ ఫాం టికెట్లు అమ్మరు.. అనుమతించరు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత గ్లౌజులు.. మాస్కులు అందజేస్తారు. దీనికి నామమాత్రం ఫీజు వసూలు చేస్తారు. ఇన్ని కండిషన్ల కంటే.. ఇంట్లో ఉండటమే బెస్ట్ అన్నట్లు అనిపిస్తోందా?