Begin typing your search above and press return to search.

జ్ఞాపకం: షీలా.. ఓ అంద‌మైన ప్రేమక‌థ‌

By:  Tupaki Desk   |   21 July 2019 4:44 AM GMT
జ్ఞాపకం: షీలా.. ఓ అంద‌మైన ప్రేమక‌థ‌
X
నాలుగుసార్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా సుప‌రిచితురాలు.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌నిరీతిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమె.. ఢిల్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని రీతిలో త‌యారు చేయ‌టంలో ఆమె పాత్ర‌ను మ‌ర‌వ‌లేం. రాజ‌కీయాల్లో ఎగుడుదిగుళ్ల‌ను చూసిన ఆమె.. అధికారాన్ని కోల్పోయినప్ప‌టికి ఢిల్లీ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఆమె స్థానం ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో స‌న్నిహిత‌ సంబంధాలున్నాయి. షీలా దీక్షిత్ కు సంబంధించి చాలామందికి తెలియ‌ని ఆమె ప్రేమ‌క‌థ ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఒక అంద‌మైనదిగా నిలుస్తుంద‌న‌టంలో ఎలాంటి సందేహం ఉండ‌దు. ఒక సంద‌ర్భంలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని మీడియాలో పంచుకున్నారు.
త‌న ప్రేమక‌థను ఆమె మాట‌ల్లోనే చెబితే..

‘‘నేను ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో వినోద్‌ ను మొదటిసారి చూశా. మా ఇద్దరిదీ ఒకే త‌ర‌గ‌తి. తొలి చూపులోనే ప్రేమ అనను కానీ వినోద్‌ చాలా చలాకీ. అందరితో కలిసిపోయేవారు. తనతో పెద్దగా పరిచయం లేదు. నా ఫ్రెండ్‌.. త‌న స్నేహితుడు ప్రేమించుకున్నారు. వారి మధ్య ఏదో గొడవ వ‌స్తే.. దాన్ని సాల్వ్ చేసేందుకు మేం తొలిసారి క‌లిశాం. వారి ఇష్యూ క్లోజ్ కాలేదు కానీ.. మేం మాత్రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం"

"నేను నెమ్మ‌ది.. తాను దూకుడు. విరుద్ధ ధ్రువాలు క‌లిసిన‌ట్లుగా మా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన స్నేహం త్వ‌ర‌గానే మ‌రింత ధృడ‌మైంది. ఎప్పుడూ మా మ‌ధ్య కుటుంబ విష‌యాలు రాలేదు. నాతో మాట్లాడేందుకు బ‌స్సులో ఎక్కేవారు. బ‌స్సులో పెళ్లి ప్ర‌పోజ‌ల్ తెచ్చారు. చాలా సంతోష‌మేసింది. ఇంట్లో చెప్పాను. మా ఇంట్లో కుల‌మ‌తాల ప‌ట్టింపులు లేవు. అయితే.. మేం ఇద్ద‌రం ఇంకా సెటిల్ కాక‌పోవ‌టంతో పెళ్లికి ఒప్పుకోలేదు. అప్ప‌ట్లో వినోద్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు"

"చాలాకాలం క‌లుసుకోలేదు.. మాట్లాడుకోలేదు. నేనో చిన్న ఉద్యోగంలో చేరా. వినోద్ ఐఏఎస్ కా దేశంలోనే తొమ్మిదో ర్యాంకు సాధించారు. టాప్ టెన్ పేర్లు రేడియోలో చ‌దివారు. వినోద్ ర్యాంకు విని మా ఇంట్లో గ‌ర్వంతో ఓకే చెప్పారు. మా ఇంట్లో ఓకే. వాళ్లింట్లో ఒప్పించాలి. వినోద్ నాన్న‌గారు ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉమాశంక‌ర్ దీక్షిత్. మాజీ ప్ర‌ధాని నెహ్రూకు అత్యంత స‌న్నిహితులు. ప‌లుకుబ‌డి ఉన్న బ్రాహ్మ‌ణ కుటుంబం"

"వాళ్ల నాన్న‌ను క‌ల‌వాల‌ని వినోద్ చెప్ప‌టంతో భ‌యం భ‌యంగా వెళ్లి క‌లిశారు. ఆశ్చ‌ర్యం.. ఆయ‌న ఎంతో మంచివారు. చ‌క్క‌గా మాట్లాడారు. త‌ర్వాత అమ్మానాన్న‌లు క‌లిసి మా ప్రేమ‌ను ఓకే చేశారు. అయితే.. కులాంత‌ర వివాహం కావ‌టంతో వినోద్ వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. దాదాపు రెండేళ్లు ఆమె ఒప్పించ‌టానికి స‌మ‌యం తీసుకున్నారు. ఆమె ఓకే అన్నాక మా పెళ్లి జ‌రిగింది"

"రెండు వేర్వేరు సంప్ర‌దాయాలు క‌లిగిన కుటుంబాలైనా.. వాటిని ప‌క్క‌న పెట్టి అంతా క‌లిసిపోయారు. 1962 జులై 11న పెళ్లికి ముహుర్తం పెట్టారు. మామ‌య్య‌కు ఆడంబ‌రాలు న‌చ్చ‌వు. అందుకే పెళ్లి చాలా సింపుల్ గా చేశారు. అలా దీక్షిత్ ఇంటి కోడ‌లిగా అడుగుపెట్టిన‌ట్లుగా చెప్పారు"