Begin typing your search above and press return to search.

పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా వచ్చింది!

By:  Tupaki Desk   |   25 Nov 2020 12:30 PM GMT
పాతబస్తీలో రోహింగ్యాలకు  ఓటు హక్కు ఎలా వచ్చింది!
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరం రాజకీయ సెగలకి నిలయంగా మారుతుంది. పోలింగ్ కి సమయం దగ్గర పడేకొద్ది , ప్రధాన పార్టీల కీలక నేతలు మాటల యుద్దానికి తెరతీశారు. ముఖ్యంగా మేయర్ పీఠమే టార్గెట్ గా వ్యూహాన్ని అమలు చేస్తున్న బీజేపీ , గ్రేటర్ పీఠం కోసం ఏకంగా కేంద్రమంత్రులని సైతం భాగ్యనగరం లో మకాం వేయించింది. అధికార టిఆర్ ఎస్ పార్టీ పై విమర్శలు కురిపిస్తూ బీజేపీ ప్రధాన నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. అధికార టిఆర్ ఎస్ , ఎంఐఎం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

గడిచిన ఐదేళ్లలో జీహెచ్ ఎం సీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేసినట్లు తెరాస అబద్దాలు చెబుతోందని, పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు అసలు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని ప్రశ్నించారు. హైదరాబాద్ ‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టిఆర్ ఎస్, మజ్లీస్‌ పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. దాదాపు 75వేల మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ లో ఎలా నివసిస్తున్నారని నిలదీశారు. అక్రమ చొరబాటు దారుల నుంచి దేశాన్ని భాజపా కాపాడుతుందని స్పష్టం చేశారు. సబ్‌ కాసాత్‌ సబ్‌ కా వికాస్‌ తో బీజేపీ ముందుకెళ్తోందని స్మృతి ఇరానీ చెప్పారు.

అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణకు అదేశించదు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.