Begin typing your search above and press return to search.

ఈ జనతా కర్ఫ్యూ ఎలా.. దీని ఫలితం ఏమిటి..?

By:  Tupaki Desk   |   20 March 2020 7:50 AM GMT
ఈ జనతా కర్ఫ్యూ ఎలా.. దీని ఫలితం ఏమిటి..?
X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ వైరస్ పాకుతోంది. పాజిటివ్ కేసులు 200కు చేరువగా ఉంది. కరోనా ప్రభావితం తో మరణిస్తున్న వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ వైరస్ నివారణకు రాష్ట్రాల తో కలిసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి చెందుతుండడం తో నివారణ చర్యలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక సూచన చేశారు. ఒకరోజు రోడ్లపైకి ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు. అదే జనతా కర్ఫ్యూ. దీంతో ఒక్కసారిగా ఆ కర్ఫ్యూపై తీవ్ర చర్చ సాగుతోంది. కర్ఫ్యూ అంటే ఏమిటి?
జనతా కర్ఫ్యూను ఎలా అమలు చేస్తారు? దాని వలన ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నలు మొదలయ్యాయి.

వాస్తవంగా కర్ఫ్యూ అనే పదం అల్లర్లు, హింసాత్మక సంఘటనలు చెలరేగినప్పుడు విధిస్తారు. పోలీస్ శాఖ దీనిపై చర్యలు తీసుకుంటుంది. ఆ ప్రాంతంతో సాధారణ పరిస్థితి నెలకొనేలా.. అల్లర్లు సద్దుమణిగేలా కర్ఫ్యూ విధిస్తారు. కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రజలెవరూ బయటకు రారు. నిరంతరం పోలీసుల గస్తీ ఉంటుంది. కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజా క్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ కర్ఫ్యూ విధిస్తారు. మనకు తరచూ జమ్మూకశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు... సడలించారు.. అనే వార్తలు విని ఉంటాం.. చూసి ఉంటాం. అయితే ఆ కర్ఫ్యూ అనేది కొంత ప్రాంతానికి విధించేవారు. దేశమంతా.. రాష్ట్రమంతా.. జిల్లా అంతా విధించరు. ఎక్కడైతే పరిస్థితి అదుపు తప్పడం, చేయి దాటి అల్లర్లు, ఘర్షణలు, మూకదాడులు తీవ్రమవుతాయో అప్పుడు పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకువస్తారు. దేశంలోనే తొలిసారి జనతా కర్ఫ్యూ విధించనున్నారు. జనతా కర్ఫ్యూ అంటే ప్రజలు తమంతటా తామే నిర్బంధించకోవడం అని అర్థం. ప్రజల కర్ఫ్యూ అని కూడా చెప్పవచ్చు. కర్ఫ్యూ సందర్భంగా 144 సెక్షన్ కూడా అమలు చేయవచ్చు.

ఎలా అమలు?
ప్రస్తుతం కరోనా వైరస్ కూడా ప్రస్తుతం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. ఆ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడడం తో.. దాని నివారణకు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ఈనెల 22వ తేదీన ఆదివారం విధించనుంది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరూ కూడా బయటకు రాకూడదు. ఆరోగ్య విపత్తు నుంచి బయటపడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు బాధ్యతాయుత పౌరులుగా ప్రజలు కూడా కరోనా వైరస్ నివారణకు సహకరించాలని కోరుతూ మార్చి 22వ తేదీన ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం దేశమంతా నిర్మానుష్యం కానుంది. అన్ని బంద్ చేసి కేవలం ఇళ్లకే పరిమితం కానున్నారు. ఈ నేపథ్యంలో ఒక అరుదైన.. అద్భుత సన్నివేశం కనిపించనుంది.

ప్రయోజనం ఏమిటి?
సాధారణంగా కరోనా వైరస్ జీవితం సుమారు 12 గంటలు ఉంటుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. అయితే కొత్తగా విస్తరించకుండా జనతా కర్ఫ్యూ అనేది దోహదం చేయనుంది. ఎందుకంటే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు ఆరు బయట తిరగకపోవడం తో ఇతరులకు సోకదు. అయితే ఆ సోకిన వైరస్ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే వెళ్లిపోతుంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అది సోకిన వారు ఆరుబయట తిరగడంతోనే ఇతరులకు వస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ వైరస్ ప్రజల్లో ఉన్నా జనతా కర్ఫ్యూ వలన ప్రజలెవరూ బయటకు రాకపోవడం తో ఇతరులకు వ్యాపించే అవకాశమే లేదు. ఇంట్లో ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండడం తో అక్కడే అది వెళ్లిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వైరస్ 12 గంటలు సజీవంగా ఉంటుంది.. జనతా కర్ఫ్యూ 14 గంటలు విధించనున్నారు. ఈ క్రమంలో ఆ వైరస్ ఎక్కడ ఉన్నా ఆ 14 గంటలు ప్రజలు బయటకు రాకపోవడంతో ఆ వైరస్ వ్యాప్తి చెందదు. కరోనా నివసించే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఆ 14 గంటల పాటు బయట తిరగరు.. కాబట్టి ఆ వైరస్ సోకిన వారు తాకలేరు.. వారు తుమ్మడం.. దగ్గడం బహిరంగంగా ఉండదు. దీంతో ఆ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి దాన్ని తరిమికొట్టవచ్చు. వైరస్ నివారణకు కర్ఫ్యూను ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు కరోనా వైరస్ వ్యాప్తిని అరికడితే ఆ వైరస్ సోకిన వారిని ఏ విధంగానైనా కాపాడుకోవచ్చు అని కేంద్రం భావిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

ప్రజా కర్ఫ్యూకు సహకరిద్దాం... 22 మార్చి ఆదివారం కర్ఫ్యూకు మద్దతు ఇచ్చి కరోనా వైరస్ బారి నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం.. మీరు కూడా సహకరించండి అని తుపాకీ మీడియా కోరుతోంది.