Begin typing your search above and press return to search.

రూ.10వేలు ఫైన్ కట్టొద్దు.. రూ.100 కడితే చాలు

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:24 AM GMT
రూ.10వేలు ఫైన్ కట్టొద్దు.. రూ.100 కడితే చాలు
X
కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వెహికిల్ చట్టం - 2019 పుణ్యమా అని.. ఆ తప్పు చేశారు.. ఈ తప్పు చేశారంటూ వేలాది రూపాయిల నుంచి లక్షలాది రూపాయిల వరకూ ఫైన్లు వేయటం తెలిసిందే. ఈ ఉదంతాలు వార్తలుగా మారి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటివేళ.. చలానాల గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదని.. వేలాది రూపాయిలు కట్టాల్సిన అవసరం లేదని.. కొన్ని తప్పులకు రూ.100 ఫైన్ కడితే సరిపోతుందని.. ఆ విషయం కొత్త చట్టంలోనే ఉందన్న విషయాన్ని చెబుతున్న పోలీసు అధికారి మాట ఇప్పుడు వైరల్ గా మారింది.

దాదాపు 15 నిమిషాల తొమ్మిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వారం క్రితం పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 9.7 మిలియన్లు (97లక్షల మంది) వీక్షించటం విశేషం. ఇంతకీ సదరు వీడియోలో ఏముందన్నది చూస్తే.. ట్రాఫిక్ చలానాల గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్ సీ.. పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి లేకుండా వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడితే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుందంటూ ఉన్న వెసులుబాటు క్లాజ్ గురించి సునీల్ సంధు వివరిస్తున్నాడు.

డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్ సీ.. పొల్యుషన్ సర్టిఫికేట్ ఇంట్లో ఉండి తమతో తీసుకురావటంలో మర్చిపోయిన వారు చలానాల బారిన అస్సలు పడాల్సిన అవసరం లేదని.. తనిఖీల్లో భాగంగా 15 రోజుల వ్యవధిలో సదరు పోలీసు అధికారులకు రూ.100 ఫైన్ తో చూపించే వెసులుబాటు ఉందన్నాడు. అయితే.. తాగి వాహనాన్ని నడపటం.. హెల్మెట్.. సీటు బెల్ట్ లాంటివి పెట్టుకోకపోవటం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం లాంటి వాటికి మాత్రం తప్పనిసరిగా కట్టాల్సిందేనంటూ సదరు పోలీసు అధికారి చెబుతున్నారు. ఆయన చెబుతున్న సమాచారాన్ని ఎంతో ఆసక్తితో వింటున్న వైనం చూస్తే.. కొత్త ఫైన్ల వ్యవహారం దేశ ప్రజల్ని ఎంతగా భయపెడుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.