Begin typing your search above and press return to search.

అమరావతే హాట్ టాపిక్ అయిపోయిందా ?

By:  Tupaki Desk   |   18 Nov 2021 12:30 AM GMT
అమరావతే హాట్ టాపిక్ అయిపోయిందా ?
X
ఒకపుడు ఏ విషయం పైన అయినా కోర్టులో కేసు ఉన్నపుడు దానిపై రాజకీయ నేతలు ఎవరు మాట్లాడేవారు కాదు. కానీ ఇపుడు అలాంటిది ఎవరు పట్టించుకోవటం లేదు. తాజాగా అమరావతి కేంద్రంగా రాజకీయంగా జరుగుతున్న రచ్చే నిదర్శనం.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయించుకున్నారు. అయితే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు దాఖలయ్యాయి.

ఇదే సమయంలో అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలంటు కొందరు ఆందోళన మొదలుపెట్టారు. తాజాగా ఇదే డిమాండ్ తో కొందరు పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో నెలలుగా నిద్రాణంగా ఉన్న కేసు విచారణ ఒక్కసారిగా మొదలైంది.

గడచిన మూడు రోజులుగా హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే మరోవైపు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.

మహా పాదయాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారంటే అర్థం రాష్ట్రమంతా అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారని అర్ధమవుతోందని చెబుతున్నారు. దీనికి కౌంటరుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబులు కూడా మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు. ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతున్నపుడు అదే విషయమై బయట మాట్లాడకూడదన్న విచక్షణ కూడా సీనియర్ నేతలు కోల్పోవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఎవరెన్ని చెప్పినా ఒక విషయం మాత్రం వాస్తవం. రాజధాని ఎక్కడుండాలన్న విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది.

అలాగే సీఎం ఎక్కడ కూర్చుని పనిచేయాలనే విషయాన్ని కోర్టు చర్చించదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అదే క్యాంపాఫీసైపోతుంది. హైకోర్టు విచారణలో ఏమి తేలుతుందనేది వేరే విషయం. కోర్టు తీర్పు ఎలాగున్నా జగన్ విశాఖపట్నం వెళ్ళి కూర్చుంటానంటే కోర్టు కూడా చేయగలిగేదేమీ లేదు.

హై కోర్టు ఎక్కడుండాలనే విషయం మాత్రమే సుప్రీంకోర్టు, హై కోర్టు పరిధిలో ఉంది. అది కూడా అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్ చేయాలని జగన్ అనుకుంటున్నారు కాబట్టి. అసెంబ్లీతో పాటు హైకోర్టును కూడా అమరావతిలోనే ఉంచేసి పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించుంటే చాలా సమస్యలు ఇఫుడుండేవే కావు. కాకపోతే రైతుల నుండి సమీకరించిన భూముల సమస్యను ఎలా పరిష్కరించబోతున్నది అనేది మాత్రమే ఆసక్తిగా మారింది.