Begin typing your search above and press return to search.

మళ్లీ ఓవర్‌ డ్రాఫ్టులోకి ఏపీ!

By:  Tupaki Desk   |   21 Dec 2022 8:39 AM GMT
మళ్లీ ఓవర్‌ డ్రాఫ్టులోకి ఏపీ!
X
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ లో రెండు వారాలు గడిచిపోయినా ఇంకా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి నెలా ఇలాగే జరుగుతుండటంతో సంక్రాంతి తర్వాత నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రోజువారీ రాబడికి, అవసరాలకు మధ్య పొంతన లేకపోవడంతో అప్పులతోనే బండి లాగిస్తోందని అంటున్నారు. దీంతో ఓవర్‌ డ్రాఫ్టులతోనే రోజువారీ ఆర్థిక వ్యవహారాలను నడపాల్సిన దుస్థితిలోకి జారుకుందని చెబుతున్నారు. ఇలా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన వెసులుబాటులో ఓవర్‌ డ్రాప్టు కింద తెచ్చుకుని జగన్‌ ప్రభుత్వం అత్యవసర బిల్లులు చెల్లిస్తోంది.

డిసెంబరులో ఇప్పటికే ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని ప్రధాన మీడియా పేర్కొంది. డిసెంబర్‌ నెలలో తొలి పది రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలోకి జారుకుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి తెచ్చిన ఓవర్‌డ్రాఫ్ట్‌ గడువు మీరిపోతుండటం.. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను ఆర్‌బీఐ స్తంభింపజేసే పరిస్థితులున్నాయని ప్రధాన మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్లను అడ్డం వేసుకుని రుణం తెచ్చి ఆర్‌బీఐ నుంచి తెచ్చిన ఓవర్‌డ్రాఫ్ట్‌కు అవసరమైన సొమ్ము చెల్లించి ఆ గండం నుంచి బయటపడింది. అయితే మళ్లీ వెంటనే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయిందని సమాచారం. ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా 36 రోజులకు మించి ఓడీలో ఉండేందుకు ఆస్కారం లేదని చెబుతున్నారు. ప్రస్తుత త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులు ఏపీ ప్రభుత్వం ఓడీలోనే ఉంది.

ఒకవైపు బహిరంగ మార్కెట్లో రుణాలు తెచ్చుకోవడానికి ఇక అవకాశం లేదని సమాచారం. రోజువారీ ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రభుత్వ అవసరాలకు చాలట్లేదని చెబుతున్నారు. డిసెంబరు 29 వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని రిజర్వుబ్యాంకు పేర్కొంటోంది.

రిజర్వు బ్యాంకు... ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు వర్తమానం అందించిందని ప్రధాన మీడియా పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకారం... డిసెంబర్‌ 13 నుంచి రాష్ట్రం ఓవర్‌డ్రాఫ్టు (ఓడీ)లోనే ఉంది. డిసెంబరు 17 నాటికి రూ.2,162.84 కోట్ల ఓడీలో ఉన్నట్లు పేర్కొంది. డిసెంబరు 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌లోనే ఉంది. ఈ నెల తొలి 20 రోజుల్లో దాదాపు 14 రోజులకు మించి రాష్ట్రం ఓడీలో ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఆర్థిక కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

కార్పొరేషన్ల రుణాలను రహస్యంగా ఉంచడంతో ఈ ఏడాది తొలి 9 నెలలకు కేంద్రం ఇచ్చిన రుణపరిమితి ఎప్పుడో దాటిపోయిందని అంటున్నారు. దీంతో ఈ నెలలో రిజర్వుబ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో ఏపీ పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.