Begin typing your search above and press return to search.

ప్రభుత్వాలకి రంగుల పిచ్చేమిటో ?

By:  Tupaki Desk   |   6 Feb 2021 2:30 PM GMT
ప్రభుత్వాలకి రంగుల పిచ్చేమిటో ?
X
ప్రభుత్వానికి రంగుల పిచ్చి పరిధి దాటిపోతోంది. ఈ రంగుల పిచ్చితోనే ఒకపుడు న్యాయస్ధానంతో కూడా తలంటు పోయించుకున్నది. అయినా బుద్దిరాలేదు. ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ నిలిపేయటం ఇపుడు చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ అభ్యంతరానికి కారణం ఏమిటయ్యా అంటే రేషన్ సరుకులను తీసుకెళ్ళి వాహనాలకు వైసీపీ రంగులు ఉండటమే.

నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని ఎన్నికలైపోయేంత వరకు అనుమతించకూడదన్నది నిమ్మగడ్డ ఆలోచన. అయితే పేదలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి నిర్ణయం విషయంలో పునరాలోచించమని కోర్టు సూచించింది. దాంతో రేషన్ మోసుకెళ్ళే వాహనాలను అధికారులను కమీషన్ కార్యాలయానికి తీసుకెళ్ళి చూపించారు. వాహనాలకు వైసీపీ రంగులను తీసేస్తే కార్యక్రమానికి అనుమతిస్తానని షరతు పెట్టారు. షరతు విధించటంలో నిమ్మగడ్డ తప్పేమీలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న ఏ రాజకీయపార్టీ అయినా తాను అమలు చేసే కార్యక్రమాలకు తన పార్టీ రంగును ఉండేట్లుగానే చూసుకుంటుంది. అయితే ఈ రంగులను ఎవరు అభ్యంతరం పెట్టనంతవరకు ఓకేనే. కానీ అభ్యంతరాలు వస్తేనే సమస్యలు మొదలవుతాయి. పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయకూడదు. ఎందుకంటే పంచాయితీ భవనాలన్నవి ప్రజల ఆస్తులు. ఈ విషయం తెలిసీ ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నది. దీన్ని టీడీపీ అభ్యంతరం చెప్పినపుడు కోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.

దివంగత సీఎం వైస్సార్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు. మొన్నటికి మొన్న టీడీపీ హయాంలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు, అన్న క్యాంటిన్లు, చివరకు వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కు కూడా పసుపు రంగులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు పేరుతో అమలు చేసిన అసేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పసుపు రంగే కనబడింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే అప్పుడు వైసీపీ అభ్యంతరం పెట్టలేదు. కానీ ఇపుడు టీడీపీ అభ్యంతరం చెబుతోంది.

నిమ్మగడ్డ రిటైర్ అయిపోయేంతలోగా ఎన్నికలు పెట్టకూడదని ప్రభుత్వం అనుకున్నది. అయితే కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుని ఎన్నికలను నిర్వహిస్తున్నారు నిమ్మగడ్డ. ఇపుడు అభ్యంతరాలు చెప్పిన వాహనాలకు వైసీపీ రంగులు వేయకుండా ఉంటే బాగుండేది. మరి తాజా అభ్యంతరాలతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. భవిష్యత్తులో అయినా రంగులపిచ్చిలో నుండి వైసీపీ బయటపడితే బాగుంటుంది.