Begin typing your search above and press return to search.

మాస్టర్ మైండ్ కేసీఆర్ ‘ తెలంగాణ దళిత బంధు’ ప్రోగ్రాం ఎలా ఉండనుంది?

By:  Tupaki Desk   |   19 July 2021 4:07 AM GMT
మాస్టర్ మైండ్ కేసీఆర్ ‘ తెలంగాణ దళిత బంధు’ ప్రోగ్రాం ఎలా ఉండనుంది?
X
ఆ మధ్యన సమాజంలో అణగారిన వర్గాలుగా ముద్ర పడి.. డెవలప్ మెంట్ కు దూరంగా ఉండే వారే కాదు.. ఇప్పటికి డెవలప్ అయి.. అనుకోని సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే వారికి దన్నుగా నిలుస్తామంటూ చెప్పి.. భారీ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా పేర్కొన్న పథకానికి తాజాగా పేరు పెట్టేశారు. దళితుల సాధికారతే తమ లక్ష్యంగా చెబుతున్న మాస్టర్ మైండ్ కేసీఆర్.. తన పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును డిసైడ్ చేశారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

అంతేకాదు.. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయటం ద్వారా.. సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. పైలట్ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు అనుభవాలు.. ఇతర ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయటానికి అధికారులకు మరింత సులువవుతుందన్నది సిఎం అభిప్రాయం.

పైలట్ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్ల తో పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారు. వారితో త్వరలోనే వర్క్ షాప్ నిర్వహించనున్నారు. తెలంగాణ దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలు ఉండనున్నాయి. అందులో మొదటిది.. పథకం అమలు చేసి పర్యవేక్షించడం. రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం. మూడోది లబ్దిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం .‘తెలంగాణ దళిత బంధు’ పథకం ద్వారా అందించే రూ.పది లక్షల నగదుతో పాటు.. లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్దిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

‘దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం.. ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలవనుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం’ అన్నది సిఎం కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి అధికారులుగా కాకుండా.. సమన్వయ కర్తలుగా.. కార్యకర్తలుగా భావించి పని చేయాల్సి ఉంటుందన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. అలాంటి చిత్తశుద్ది.. దళితుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్న అధికారుల్ని గుర్తించాలని ఉన్నత అధికారుల్ని సీఎం ఆదేశించటం గమనార్హం.

తాజాగా ప్రగతిభవన్ లో ‘దళిత సాధికారత అమలు – పైలట్ ప్రాజెక్టు ఎంపిక – అధికార యంత్రాంగ్రం విధులు’ అనే అంశంపై ఆదివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. సెలవురోజైన ఆదివారం కూడా గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక సూచనలు.. వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణ దళిత బంధు పథకాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి వుంది. మూస పద్దతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార , ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీ గా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. పూర్తిస్థాయి గణాంకాలు, సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలుకాదు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ను ఆధారం చేసుకుని, దళిత బంధు పథకం అమలులో ముందుకు సాగాలి’ అని సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పారు.

తినేటప్పుడు ఎంతగా లీనమై తింటామో.. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష ప్రదర్శిస్తామో.. తెలంగాణ దళిత బంధు పథకం అమలులో అధికారులు అంతే కమిట్ మెంట్ ను ప్రదర్శించాలని కేసీఆర్ కోరారు. తమ అభివృద్ధి గురించి.. గత పాలకులు అనుసరించిన విధానాలతో దళితుల్లో ఎలాంటి డెవలప్ మెంట్ కనిపించలేదన్న అపనమ్మకం ఏర్పడిందని.. వారిలో గూడు కట్టుకున్న భావన పోగొట్టాల్సి ఉందన్నారు. దళిత బంధు పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహించబోదని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు పథకంతో.. రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతును అభివృద్ది సంక్షేమ పథంలో నడిపించిన విధంగానే.. తాజా దళిత బంధు పథకంతో తెలంగాణ రాష్ట్రం లో దళిత సాధికారత కోసం విశేష కృషి చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మొత్తమ్మీదా ఈ పథకం రాజకీయంగా అలజడిని రేపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.