Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా ప్ర‌గ‌తి నివేదిక ఖ‌ర్చు లెక్క‌!

By:  Tupaki Desk   |   30 Aug 2018 7:57 AM GMT
హాట్ టాపిక్ గా ప్ర‌గ‌తి నివేదిక ఖ‌ర్చు లెక్క‌!
X
ఒక‌టి కాదు రెండు కాదు.. ఆ మాట‌కు వ‌స్తే.. ఐదు.. ప‌ది కూడా కాదు. ఏంటీ అంకెలు అంటారా.. ఇప్పుడు చెబుతున్న అంకెల‌న్నీ ల‌క్ష‌ల్లో జ‌న‌స‌మీక‌ర‌ణ అంటే మాట‌లు కాదు. కానీ.. ఇవేమీ స‌రిపోవ‌న్న‌ట్లుగా ఏకంగా పాతిక ల‌క్ష‌ల మందితో కొంగ‌ర వ‌ద్ద ప్ర‌గ‌తి నివేద‌న పేరుతో కేసీఆర్ నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగానూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

కేసీఆర్ నోట్లో నుంచి ఏదైనా మాట వ‌స్తే.. అంత తేలిగ్గా తీసుకోవ‌టానికి లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న నిర్వ‌హించిన ఏ స‌భ అయినా గ్రాండ్ గా ఉండ‌ట‌మే కాదు.. కొత్త పుంత‌లు తొక్కేలా ఉంటుంది. తెలంగాణ ఉద్య‌మ వేళ‌.. ఆ విష‌యాన్ని చాటి చెప్పారు కేసీఆర్‌. విప‌క్షంలో ఉండి.. ప‌రిమిత వ‌న‌రుల‌తో చేప‌ట్టిన స‌భ‌ల్నే గ్రాండ్ స‌క్సెస్ చేసిన స‌త్తా కేసీఆర్ సొంతం. అలాంటి ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చెప్పిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ భారీగా ఉండ‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ స‌భ చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది.

త‌న శ‌క్తియుక్తుల్ని ధార‌పోసి మ‌రీ యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌భ‌లో త‌మ నాలుగున్న‌రేళ్ల కాలంలో త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్ని పెద్ద ఎత్తున ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. ముంద‌స్తు మూడ్ ను తేవ‌ట‌మే కేసీఆర్ ల‌క్ష్యంగా చెబుతున్నారు. మ‌రి.. ఇంత భారీ స‌భ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిధుల మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

పాతిక ల‌క్ష‌ల మందిని స‌భ వ‌ద్ద‌కు తీసుకురావ‌టం కోసం దాదాపు 8 వేల ఆర్టీసీ బ‌స్సుల్ని హైర్ లోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రైవేటు.. స్కూల్ బ‌స్సులు క‌లుపుకొని దాదాపు ప‌దిహేను వేల‌కు పైగా వాహ‌నాల్ని స‌భ కోసం త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంటే.. ఈ స‌భ కోసం ఉప‌యోగించే వాహ‌నాల సంఖ్యే వేలల్లో ఉండ‌నుంది.

మ‌రి.. వీటికి అయ్యే అద్దెలు.. పెట్రోల్.. డీజిల్ ఖ‌ర్చుల‌తో పాటు.. పాతిక ల‌క్ష‌ల‌మందికి (ఒక‌వేళ 20 ల‌క్ష‌ల‌కే త‌గ్గించుకున్నా) అంత మందికి అవ‌స‌ర‌మైన ఆహారం.. మంచినీళ్లు.. ప్ర‌యాణ ఖ‌ర్చుల కింద ఎంతోకొంత మొత్తాన్ని ముట్ట‌చెప్పేందుకు అయ్యే ఖ‌ర్చుల‌న్ని క‌లిపితే.. వ‌స్తున్న మొత్తం ఎంతో తెలుసా? అక్ష‌రాల వంద కోట్ల‌కు పైనేన‌ని చెబుతున్నారు.

మ‌రి.. ఇంత భారీ స‌భ కోసం పెడుతున్న ఖ‌ర్చు ఎక్క‌డిది? ఎవ‌రు ఎంత సాయం చేస్తున్నారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయి. ఒక అంచ‌నా ప్ర‌కారం వంద కోట్లు ఈ స‌భ‌కు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లుగా చెబుతున్నా.. వాస్త‌వంగా చూస్తే.. మ‌రో పాతిక కోట్లు అద‌నంగా ఖ‌ర్చు అయిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇంత భారీ ఖ‌ర్చుతో స‌భ‌ను నిర్వ‌హించే క‌న్నా.. అంతే మొత్తాన్ని ఏదైనా ప‌థ‌కం కోస‌మో.. ఒక ప‌ట్ట‌ణం కోస‌మో ఖ‌ర్చు చేయొచ్చుగా? అలా చేస్తే.. ప‌ట్ట‌ణం బాగుప‌డుతుంది కానీ.. కేసీఆర్ చేతికి అధికారం రాదు క‌దా!