Begin typing your search above and press return to search.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీగా డబ్బు సంచులు తరలుతున్నాయా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 6:30 AM GMT
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీగా డబ్బు సంచులు తరలుతున్నాయా?
X
సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం స్కాం లెక్క తేల్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందో తెలిసిందే. తనకు లభించిన అపురూప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్న పట్టుదలతో కేంద్రం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏ చిన్న పాయింట్ ను వదలకుండా విచారణ చేస్తున్న వైనం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త అంకానికి తెర తీసింది. ఈ స్కాంకు సంబంధించిన కీలక లింకు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ కుంభకోణంలో డబ్బు హవాలా మార్గంలో కాకుండా బేగంపేట విమానాశ్రాయం నుంచి ప్రైవేటు విమానాల ద్వారా తరలించారన్న కొత్త వాదన ఇప్పుడు కొత్త సంచలనానికి తెర తీసినట్లైంది.

దీనికి సంబందించిన ఆధారాల్ని ఈడీ గుర్తించిందని.. తీగ దొరికిందని.. డొంక కదలటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. ఈ అక్రమ వాయి రవాణాకు బ్యాక్ గ్రౌండ్ గా.. బ్యాక్ బోన్ గా ఉన్నది ఇటీవలే ఈడీ అరెస్టు చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి.. జెట్ సెట్ గో ఏవియేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కనికా టెక్రివాల్ రెడ్డిగా చెబుతున్నారు. ఈ సంస్థకు సంబంధించిన చార్టర్ విమానాల్లోనే హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు నగదును భారీగా తరలించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రాధమిక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.

బేగంపేట ఎయిర్ పోర్టులోనే ఎందుకు? అన్న దానికి సమాధానం రెఢీగా ఉంది. ఈ విమానాశ్రయాన్ని ప్రధాన ఎయిర్ పోర్టుల మాదిరి కాకుండా వీవీఐపీలు.. ప్రముఖుల రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టులో మిగిలిన ఎయిర్ పోర్టుల మాదిరి స్క్రీనింగ్ లేకపోవటంతో వీవీఐపీల వాహనాలు నేరుగా రన్ వే మీదకు అంటే విమానాలు నిలిపి ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లిపోయే సౌకర్యం ఉండటం కూడా ఈ హవాలా కుంభకోణానికి తెర తీసి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.

గత నెల 17న ఎయిర్ పోర్టు్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్తా ఒక లేఖ రాశారు. ఇది కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ లేఖ సారాంశం ఏమంటే.. దేశంలోని ప్రైవేటు జెట్ చార్టర్డ్ సేవలు అందిస్తున్న జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ కు డాక్యుమెంట్లు.. సమాచారం అత్యవసరంగా కావాలి. కంపెనీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఆ సంస్థ విమానాల ఆపరేషన్ల పూర్తి వివరాలు.. ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలతో పాటు.. కంపెనీ మేనేజర్ల వివరాల్ని కూడా అందించాలని పేర్కొన్నారు.

ఈ లేఖను దేశంలోని వివిధ విమానాశ్రయాల డైరెక్టర్లకు పంపారు. ఈ లేఖ అందిన తర్వాతి రోజునే సమాచారాన్ని పంపినట్లుగా తెలుస్తోంది. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నగదు తరలించినట్లుగా ఈడీకి ప్రాథమిక ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా ఈ వివరాల్ని ఎవరూ ధ్రువీకరించటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు.. అది కూడా ప్రస్తుతం ప్రోటోకాల్ కలిగిన వారు తప్పించి మిగిలిన వారికి అనుమతులు ఇవ్వకుండా బ్యాన్ విధించినట్లుగా చెబుతున్నారు.

ప్రైవేటు విమానాలు ఏమైనా సరే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచే అనుమతులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ హవాలా ఆరోపణల పుణ్యమా అని బేగంపేట ఎయిర్ పోర్టుకు కొత్త మరక అంటటమే కాదు.. మద్యం స్కాంలో కీలక ముందడుగు పడిందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.