Begin typing your search above and press return to search.

షాకింగ్...ఎయిమ్స్ లో 480 మందికి కరోనా

By:  Tupaki Desk   |   4 Jun 2020 5:30 PM GMT
షాకింగ్...ఎయిమ్స్ లో 480 మందికి కరోనా
X
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా ప్రబలుతోంది. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగడం కలవరపెడుతోంది. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న ఉద్దేశ్యంతో ఇచ్చిన సడలింపుల వల్ల కేసుల సంఖ్య కొద్దిగా పెరగడం శోచనీయం. కొద్ది రోజులుగా రోజుకు దాదాపు 9వేల కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో ఏకంగా 480 మందికి కరోనా సోకింది, వీరిలో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది ఆస్పత్రి అటెండర్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, మిగిలిన వారు ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

ఎయిమ్స్ లో ఇంతమందికి కరోనా సోకడంతో వైద్య వర్గాల్లో కలవరం మొదలైంది. అక్కడ విధులు నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీఈలు ధరించినప్పటికీ కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 23,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బారిన పడి 9,542 మంది కోలుకోగా.. 606 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 13,497 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.