Begin typing your search above and press return to search.

ఉన్న రెండింటి కోసం పోటీ పడుతున్నోళ్లెందరో?

By:  Tupaki Desk   |   21 Feb 2020 10:30 AM GMT
ఉన్న రెండింటి కోసం పోటీ పడుతున్నోళ్లెందరో?
X
తెలంగాణ రాష్ట్ర పరిధిలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిని భర్తీచేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు టీఆర్ ఎస్ సీనియర్ నేత కేకే.. బీజేపీ నేత గరికపాటి రామ్మోహన్ రావు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరూ రాజ్యసభ సీటును సొంతం చేసుకుంది ఒక పార్టీలో అయితే.. పదవి చేతికి వచ్చాక మరో పార్టీలో చేరిన వైనం ఈ ఇద్దరు ఎంపీల్లో కామన్ గా కనిపిస్తుంది. కేకే అన్నంతనే కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తు చేసుకునేటోళ్లు ఎందరో. అదే సమయంలో గరికపాటి రామ్మోహన్ అన్నంతనే టీడీపీ నేతగా గుర్తింపు ఉంది. ఇలాంటి వీరిద్దరూ కేకే టీఆర్ ఎస్ లో చేరితే.. గరికపాటి ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ రెండు స్థానాల్ని చేజిక్కించుకోవటానికి తెలంగాణ అధికారపక్షానికే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో తిరుగులేని అధిక్యత టీఆర్ ఎస్ సొంతం. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు 104 ఉండగా.. మజ్లిస్ కు ఏడు.. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో.. మిగిలిన పార్టీలు బరిలోకి దిగే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న రెండు స్థానాల కోసం భారీగా పోటీ ఉంది.

గత ఎన్నికల వేళలో ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించిన పొంగిలేటికి కేసీఆర్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో.. నాడు జరిగిన అన్యాయాన్ని ఈసారి రాజ్యసభకు ఎంపిక చేయటం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ తో పాటు.. న్యాయం చేసినట్లు అవుతుందన్న ఆలోచనలో సారు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఉన్న రెండింటిలో ఒక స్థానమే మిగిలింది. ఈ స్థానాన్నిసిట్టింగ్ ఎంపీ కేకేకు మరోసారి అవకాశం ఇస్తారా? అన్నది ప్రశ్న. ఎందుకిలా అంటే..ఆ ఒక్క స్థానాన్ని చేజిక్కించుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన కేసీఆర్ కుమార్తె కవితకు రాజ్యసభ సీటును కేటాయించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు పలువురు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఏ పార్టీకి చెందిన అధినేతతో అయినా యాక్సిస్ కావాలంటే కాసేపటికే రెఢీ చేసే కేకే లాంటోడికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంపీగా ఓటమి పాలైన వినోద్ కుమార్ కు అవకాశం కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కీలక పదవిలో ఉండటంతో ఆయన్ను ఎంపిక చేసే అవకాశం లేదంటున్నారు. ఇదే సీటు కోసం మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. మరో మాజీ మంత్రి కమ్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు మండవ వెంకటేశ్వరరావు లు తమకు అవకాశం దక్కుతుందన్న ఆలోచనలో ఉన్నారు.

వీరుకాకుండా మాజీ స్పీకర్ మధుసూదనాచారి.. బూర నర్సయ్య గౌడ్.. తుమ్మల నాగేశ్వరరావు.. జూపల్లి కృష్ణారావులతోపాటు.. ఇప్పటివరకూ ఎస్పీ ఎస్టీ నేతలకు రాజ్యసభకు టీఆర్ ఎస్ నుంచి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా తమ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న వాదనను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఎస్సీల నుంచి మందా జగన్నాథం.. ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. ఇలా ఒకరికి మించి మరొకరు పదవి కోసం పాట్లుపడుతున్న వేళ.. సారు ఛాయిస్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.