Begin typing your search above and press return to search.

చిరు ప్రెస్ రిలీజ్ వెనుక భారీ కుట్ర?

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:14 AM GMT
చిరు ప్రెస్ రిలీజ్ వెనుక భారీ కుట్ర?
X
అంతకంతకూ విస్తరిస్తున్న సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది ఏ మాత్రం అర్థం కానిదిగా మారింది. నిజమనిపించేలా అబద్ధాన్ని అందంగా మార్చేస్తున్న వైనంతో ప్రజలు మాత్రమే కాదు.. మీడియాలో పని చేస్తున్న వారికి తలనొప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో మాదిరి సమాచారం ఒక పద్ధతి ప్రకారం రాకపోవటం.. సోషల్ మీడియా ప్రభావంతో కొన్ని అబద్ధాలు నిజాలుగా ప్రచారం జరిగిపోతోంది.

మొన్నటికి మొన్న ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించకపోయినా.. తనిఖీలు చేసినట్లుగా వార్తలు రావటం.. చివరకు సుమ అండ్ కో సీన్లోకి వచ్చి..తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తారంటూ కయ్యిమన్నంతనే కొన్ని మీడియా సంస్థలు తాము రాసిన రాతలు తప్పన్న విషయాన్ని తెలివిగా చెప్పేయటం చూశాం. మరో యాంకర్ అనసూయ ఇంట్లోనూ జీఎస్టీ తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొనటం.. అది కూడా తప్పేనని ఆమె చెప్పటం చూస్తున్నాం.
ఇలా బయటకు వచ్చే సమాచారంలో ఏది నిజం? మరేది అబద్ధమన్నది ఫిల్టర్ చేయటం ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. దీనికి ఉదాహరణగా తాజాగా మరో ఉదంతం తెర మీదకు వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మెగాస్టార్ చిరంజీవి తన సానుకూలతను వ్యక్తం చేయటం తెలిసిందే. ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యల్ని తాను స్వాగతించటమే కాదు.. మూడు రాజధానులతో ఏపీకి ప్రయోజనం చేకూరుతుందన్న చిరంజీవి మాట చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. చిరంజీవి స్వదస్తూరితో సంతకం చేసినట్లుగా ఉన్న ఆ ప్రెస్ నోట్ లోని కంటెంట్ మరింత ఆసక్తికరంగానే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీసేలా ఉండటం గమనార్హం. ‘‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. ’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఓ ప్రకటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విచిత్రంగా ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఖండించినట్లుగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మూడు రాజధానుల్ని తాను సమర్థిస్తున్నట్లుగా విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని.. ఆదివారం తన పేరుతో విడుదలైన ప్రకటన అవాస్తవంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ చెప్పిన మూడు రాజధానుల్ని తాను సమర్థిస్తున్నట్లుగా చిరు మరోసారి స్పష్టం చేయటం గమనార్హం. ఇలా ప్రముఖుల పేరుతో బయటకు వస్తున్నఫేక్ ప్రెస్ రిలీజ్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకలా బయటకు వస్తున్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాన్ని వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.