Begin typing your search above and press return to search.

డెబ్బై అడుగుల కటౌట్..ఆయనను మంత్రిని చేస్తుందా?

By:  Tupaki Desk   |   30 May 2019 4:27 AM GMT
డెబ్బై అడుగుల కటౌట్..ఆయనను మంత్రిని చేస్తుందా?
X
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో కొడాలి నానికి స్థానం లభిస్తుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. కొడాలి నాని రెండు పద్నాలుగు ఎన్నికల ముందు నుంచి జగన్ వెంట నడుస్తూ ఉన్నారు. ప్రత్యేకించి గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్స్ లో ఒకరిగా నిలుస్తూ వచ్చారు కొడాలి వెంకటేశ్వరరావు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై విరుచుకుపడటంలో కొడాలి నాని ముందుంటూ వచ్చారు.

ఒక దశలో నానికి తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చెప్పిందంటారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు దశలో కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చెప్పింది. అయితే ఆయన మాత్రం అటు వైపు వెళ్లలేదు. జగన్ తోనే కలిసి నడిచారు.

ఇక ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కొడాలి నాని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంది. చంద్రబాబు హిట్ లిస్టులో కొడాలి నాని కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయనను తెలుగుదేశం పార్టీ ఓడించలేకపోయింది. ఎమ్మెల్యేగా నెగ్గి మళ్లీ అసెంబ్లీలోకి ఎంటరవుతున్నారు కొడాలి.

అంతే కాదు.. ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఆశావహుల్లో కూడా ఒకరిగా ఉన్నారు. 'కమ్మ' కోటాలో అయినా కొడాలి నానికి మంత్రి పదవి ఖాయమనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణ సమీపంలో కొడాలి నాని ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఆసక్తిదాయకంగా మారింది. ఏకంగా డెబ్బై అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేయించారు నాని.

అక్కడ ఏర్పాటు చేసిన కటౌట్లలో కెళ్లా ఇదే పెద్దదని తెలుస్తోంది. ఈ ఏర్పాట్లు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. కొడాలి నానికి మంత్రి పదవి ఖాయమేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.