Begin typing your search above and press return to search.

పుష్కరాలకు పీక్ స్టేజ్

By:  Tupaki Desk   |   18 July 2015 10:14 AM GMT
పుష్కరాలకు పీక్ స్టేజ్
X
గోదావరి పుష్కరాలకు జనం పోటెత్తుతున్నారు. వరుస సెలవుల కారణంగా ప్రజలంతా గోదారి వైపే దారి తీస్తున్నారు. రాజమండ్రిలోని ఘాట్లన్ని భక్త జనసందోహంగా మారాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు 10 లక్షల మంది గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించారు. అయితే అనూహ్య రీతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయానికే మరో రెండు లక్షల మంది భక్తులు స్నానాలను ఆచరించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 12 లక్షల మంది స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాజమండ్రి పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి కొనసాగుతూ ఉంది. వరుస సెలవు దినాల నేపథ్యంలో భక్తుల తాకిడి అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు భక్తుల తాకిడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితులపై సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

కాగాఅనూహ్యరీతిలో గోదావరి పుష్కర స్నానాలకు తండోపతండాలుగా తరలివస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా అయింది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనంతో రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతున్న నేపథ్యంలో అధికారులు మోడ్రన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. డ్రోన్‌ కెమెరాల సహాయంతో రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. అదే విధంగా పుష్కర ఘాట్ల వద్ద డ్రోన్ల సహాయంతో పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలో రెండు, కొవ్వూరులో, భద్రాచలంలో ఒకటి చొప్పున డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తూ అధికారులు రద్దీని పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలో ఏ పుష్కర ఘాట్ ను చూసిన జనసందోహమే. ఘాట్లన్నీ ఇసుక వేస్తే రాలనంత జనరద్దీతో నిండిపోయాయి.

మరోవైపు తెలంగాణలో కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజులు సెలవలు రావడంతో భక్త జనం పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో కరీంనగర్, కాళేశ్వరం రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించిపోయేంతగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ రోడ్డులో దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.