Begin typing your search above and press return to search.

చండీ యాగం రెండో రోజూ అత్యద్భుతం

By:  Tupaki Desk   |   25 Dec 2015 4:31 AM GMT
చండీ యాగం రెండో రోజూ  అత్యద్భుతం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం రెండో రోజూ అత్యద్భుతంగా జరిగింది. ఊహించిన దాని కంటే భారీగా ప్రజలు హాజరు కావటం విశేషం. తొలిరోజు యాగానికి యాభై వేల మంది వస్తే.. గురువారం మాత్రం అంతకు రెట్టింపు సంఖ్యలో హాజరు కావటం విశేషం. సెలవు దినం కలిసి రావటంతో.. చుట్టుపక్కల గ్రామాలతో పాటు.. దూర ప్రాంతాల నుంచి కూడా చండీయాగాన్ని చూసేందుకు జనాలు పోటెత్తారు. దీంతో.. ఒక్క గురువారం లక్షకు పైగా ప్రజలు యాగానికి హాజరైనట్లుగా అంచనా వేస్తున్నారు.

యాగాన్ని చూసేందుకు ఉదయం ఏడు గంటల నుంచే జనసందోహం మొదలైంది. 11 గంటల సమయానికి భారీగా ప్రజలు తరలిరావటంతో.. యాగ స్థలిని చూసేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు బారులు తీరాయి. దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వీవీఐపీల తాకిడి కూడా భారీగానే ఉంది. గురువారం కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు.. బండారు దత్తాత్రేయ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావులతో పాటు.. పలువురు తెలంగాణ మంత్రులు.. నేతలు.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

ప్రముఖులకు పూర్ణకుంభంతో మంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మేళం అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఇక.. ప్రముఖులను స్వయంగా హోమగుండం వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రిని.. వారిని సన్మానించారు. చండీయాగానికి వచ్చే ప్రముఖుల్ని యాగశాల వద్దకు తీసుకెళ్లే క్రమంలో.. రుత్వికులు ధరించే వస్త్రాలనే కప్పి తీసుకెళ్లారు. మొత్తంగా అధ్యాత్మిక శోభతో ఎర్రవెల్లి కొత్త అందాల్ని పర్చుకోవటమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా చండీయాగం అందరిని విశేషంగా ఆకర్షిస్తోంది.